కర్ణాటక(Karnataka) రాజధాని(Capital) బెంగళూరు(Bengaluru)లోని స్కూళ్లకు బాంబు బెదిరింపులు(Bomb Threat) తీవ్ర కలకలం రేపుతోంది. గుర్తుతెలియని వ్యక్తి ఈ మెయిల్ అడ్రస్ నుంచి బెదిరింపులు వచ్చాయని పోలీసులు వెల్లడించారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 44స్కూళ్ల(Schools)కు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.
దీంతో పాఠశాల యాజమాన్యాలతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనపై కర్ణాటక హోం మంత్రి డాక్టర్ జి.పరమేశ్వర స్పందించారు. బాంబుదాడి చేస్తామనే బెదిరింపు మెయిల్స్ 44 పాఠశాలలకు వచ్చినట్లు గుర్తించామన్నారు. ఇప్పుడే కాదు.. గతంలోనే ఇలాంటి బెదిరింపు కాల్స్ 15స్కూళ్లకు వచ్చాయన్నారు.
అయితే తాము ఎలాంటి రిస్క్ తీసుకోలేమని చెప్పారు. అందుకే పాఠశాలలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామన్నారు. అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పోలీస్ శాఖ నుంచి ప్రాథమిక సమాచారం అందినట్లు పరమేశ్వర వెల్లడించారు.
అయితే, గత ఏడాది ఇలాంటి బెదిరింపులు రాగా అవి నకిలీవిగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇప్పుడు వచ్చిన బెదిరింపులు కూడా అలాంటివే అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే మెయిల్స్ పంపిన వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు, బెదిరింపులు వచ్చిన పాఠశాలల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.