ముంబై (Mumbai)లో పలు సంస్థలకు బాంబు బెదిరింపు (Bomb Threats)లు రావడం కలకలం రేపుతోంది. కొలాబాలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ మ్యూజియం, వర్లీలోని నెహ్రూ సైన్స్ సెంటర్ తో పాటు ఇతర సంస్థలకు బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చాయి. మొత్తం 8 సంస్థలకు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. మొదట మ్యూజియానికి బెదిరింపు మెయిల్ వచ్చినట్టు పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలో తాము అలర్ట్ అయ్యామని చెప్పారు. ఆ తర్వాత మిగిలిన సంస్థలకు మెయిల్స్ వచ్చాయని పేర్కొన్నారు. దీంతో పాటు బైకులా జూ పార్క్ కు కూడా బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయన్నారు. ఈ మెయిల్స్ నేపథ్యంలో స్థానిక పోలీసులు, బాంబ్ డిఫ్యూజ్ స్క్వాడ్ తో కలిసి తనిఖీలు చేశారు. కానీ ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని వెల్లడించారు.
మ్యూజియం అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఐపీసీలోని 505 (1) (b), 506(2),182 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. మరోవైపు కోల్ కతాలోని ఐకానిక్ ఇండియన్ మ్యూజియంలో బాంబులు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ చేశారు.
మ్యూజియంలోని బాంబులు ఏ సమయంలోనైనా పేలిపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మ్యూజియం వద్దకు చేరుకున్నారు. మ్యూజియంలో తనిఖీలు చేపట్టారు. మ్యూజియంలోకి సందర్శకులను అనుమతించలేదు. ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో లొకేషన్ ట్రేస్ చేసేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారని వివరించారు.