జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో పది మంది మృతిచెందారు. రహదారిపై వెళుతున్న ట్యాక్సీ రాంబన్ ప్రాంతానికి సమీపంలో అదుపుతప్పి లోయలో పడిపోయింది.
ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న వారిలో 10మంది వరకు మృతి చెందినట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఎస్డీఆర్ఎఫ్, సివిల్ క్విక్ రెస్పాన్స్ టీమ్(QRT) ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు, సహాయక బృందాలు మృతదేహాలను వెలికి తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. జమ్మూలో మంచుకొండలను చూసేందుకు పర్యాటకులు ప్రత్యేక వాహనాల్లో వెళ్తుంటారు. ఈ క్రమంలో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గతేడాది ఇలాంటి ఘటనలు అనేకసార్లు చోటుచేసుకోగా పదుల సంఖ్యలో టూరిస్టులు మృతిచెందారు.
గతేడాది నవంబర్ మాసంలో కిష్త్వర్ నుంచి జమ్మూ కశ్మీర్‌కు 60 మంది ప్రయాణికులతో ఓ బస్సు లోయలో పడి 38మంది మృతిచెందారు. మరో ప్రమాదంలో జాజ్జర్ కోట్లీలో అమృత్సర్ నుంచి కత్రా వెళ్తున్న బస్సు లోయలో పడి 10మంది మృతిచెందారు. అప్పుడు బస్సులో 75మంది వరకు ఉండగా మిగతా వారికి తీవ్రగాయాలయ్యాయి.