భారత మాజీ ప్రధాని, తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు(PV Narasimha Rao)కు కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించింది. అదేవిధంగా మరో మాజీ ప్రధాని చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్‌కు సైతం భారతరత్న ప్రకటించారు.
ప్రధాని మోడీ(PM Modi) ఎక్స్ ఖాతాలో ‘మన మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారిని భారతరత్నతో సత్కరిస్తున్నందుకు సంతోషిస్తున్నాం. ఆయన వివిధ హోదాల్లో దేశానికి విస్తృతంగా సేవలందించారు. భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో దూరదృష్టి గల నాయకత్వం ఆయనది. దేశ శ్రేయస్సు, అభివృద్ధికి బలమైన పునాది వేశారు.’ అంటూ ట్వీట్ చేశారు.
పీవీ నరసింహారావు వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని లక్నేపల్లిలో రత్నాబాయి, సీతారామారావు దంపతులకు 1921 జూన్ 28వ తేదీన జన్మించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరకు చెందిన రంగారావు, రుక్మిణమ్మ దంపతులు ఆయనను దత్తత తీసుకున్నారు. 1952లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తొలిసారి 1957లో మంథని ఎమ్మెల్యేగా గెలిచారు. ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా ఉన్నత పదవుల్లో విశేష సేవలందించారు.
దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో పీవీ కీలక పాత్ర పోషించారు. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో మన్మోహన్‌సింగ్‌ను ఆర్థిక మంత్రిగా నియమించుకుని హరిత విప్లవం, ఎగుమతులు, టెలీ కమ్యూనికేషన్, టెక్నాలజీతో దేశ స్వయం సమృద్ధికి, సాంకేతికతకు బీజం వేశారు. విద్యారంగంలోనూ ఎన్నో సంస్కరణలు తెచ్చారు పీవీ.
తాజాగా పీవీకి భారత రత్న ప్రకటించడంపై ఆయన కూతురు, ఎమ్మెల్సీ వాణీదేవి భావోద్వేగానికి గురయ్యారు. ‘కొంచెం ఆలస్యమైనా చివరికి నాన్నకు గొప్ప గౌరవం దక్కింది. ఇప్పటికీ ఆయన సంస్కరణలే దేశానికి దిక్సూచీ. పార్టీలకతీతంగా ప్రధాని మోడీ తీసుకున్న ఈ నిర్ణయం హర్షనీయమైనది. ఇది తెలంగాణతో పాటు దేశ ప్రజలకు గర్వంచే క్షణం’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
Delighted to share that our former Prime Minister, Shri PV Narasimha Rao Garu, will be honoured with the Bharat Ratna.
As a distinguished scholar and statesman, Narasimha Rao Garu served India extensively in various capacities. He is equally remembered for the work he did as… pic.twitter.com/lihdk2BzDU
— Narendra Modi (@narendramodi) February 9, 2024