దండకారణ్యంలో మరోసారి తుపాకుల మోత మోగింది. ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) సరిహద్దులో మరోసారి భారీ ఎన్కౌంటర్ (Encounter) చోటు చేసుకుంది. శనివారం భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య భీకరంగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా ఇద్దరు జవాన్లకు తీవ్రగాయాలైనట్లు సమాచారం.
ఈ ఘటన బీజాపూర్ జిల్లాలోని పీడియా అటవీ ప్రాంతంలో జరిగింది. ఘటన స్థలం నుంచి భద్రతా దళాలు పెద్దఎత్తున మందుగుండు సామగ్రి, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టులు ఎవరన్నది అధికారులు ఇంకా వెల్లడించలేదు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే నాలుగు రోజుల కిందట ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని గడ్చిరోలిలో భద్రత బలగాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్ట్ అగ్రనేతలు హతమైన విషయం తెలిసిందే. ఆ ఘటనలో ఎన్కౌంటర్లో డీవీసీ సభ్యుడు వర్గీష్, డీవీసీ మంగాతు, ప్లాటూన్ సభ్యుడు కురసం రాజు, ప్లాటూన్ సభ్యుడు వెంకటేష్ మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
ఘటనా స్థలంలో ఒక AK47, ఒక కార్బైన్, రెండు పిస్టల్స్‌తో సహా పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. రేషన్ పల్లి సమీపంలోని కోలమర్క పర్వతాల్లో మంగళవారం ఉదయం ఈ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుండగా నక్సల్స్ విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తాజాగా జరిపిన కాల్పులు ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు.