బెంగళూర్(Bangalore) నగరంలో భారీ పేలుడు సంభవించింది. ఇక్కడ ప్రముఖ రెస్టారెంట్‌గా పేరొందిన వైట్‌ఫీల్డ్(Whitefield)లోని రామేశ్వరం కేఫ్(Rameswaram Cafe) వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుడులో కనీసం నలుగురు గాయపడినట్లు తెలుస్తోంది.
గాయపడిన వారిలో ముగ్గురు సిబ్బంది ఉండగా, ఒకరు కస్టమర్ ఉన్నారు. ప్రాథమిక నివేదిక ప్రకారం మధ్యాహ్నం 1 గంట సమయంలో బ్యాగులో ఉంచిన వస్తువు పేలినట్లుగా సమాచారం. పేలుడు సంభవించడంతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురై పరుగులు
తీశారు.
పేలుడు వార్త తెలియగానే వైట్‌ఫీల్డ్ ఏరియా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పెద్దశబ్దం రావడంతో సిలిండర్ పేలిందని భావించి పరుగులు తీశామని స్థానికులు చెబుతున్నారు.
అయితే, పేలుడుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరాలేదు. కేఫ్‌లో షార్ట్ సర్వ్క్యూట్ కారణంగా సిలిండర్ పేలి మంటలు వ్యాపించాయా? ఉగ్ర కుట్రనా? అనేది తెలియాల్సివుంది. ఈ మేరకు బాంబ్ స్క్వాడ్ ఘటనాస్థలానికి చేరుకుని తనిఖీ చేపట్టింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.