బీహార్ ముఖ్యమంత్రి(Birhar CM) నితీశ్‌కుమార్(Nitish Kumar) తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఉదయం రాజ్‌భవన్(Rajbhavan)కు వెళ్లి గవర్నర్ రాజేంద్ర అర్లేకర్(Governor Rajendra Arlekar)కు తన రాజీనామా లేఖను సమర్పించారు. సీఎం పదవికి రాజీనామా చేసిన నితీశ్‌కుమార్ బీజేపీతో కలిసి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
సీఎంగా మళ్లీ ఆయనే ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే బీజేపీ నుంచి ఆయనకు మద్దతు లేఖ అందినట్లు కూడా చెబుతున్నారు. నితీష్ మళ్లీ ఈ సాయంత్రం ఐదు గంటలకు రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు. ఈ ఉదయం దాకా ఆయన ఆర్జేడీ, కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రిగా ఉంటే, సాయంత్రం మాత్రం బీజేపీ మద్దతుతో అదే కుర్చీలో కూర్చుంటారు.
ఇప్పటివరకు 8సార్లు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు నితీష్‌కుమార్. అయితే ఒక్కసారి కూడా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ప్రతీసారి ఏదోఒక పార్టీతో జత కట్టే సీఎం పగ్గాలు అందుకున్నారు. జేడీయూకి తక్కువ సీట్లు వచ్చినా.. ప్రతిసారీ ముఖ్యమంత్రి మాత్రం నితీష్ కావడం గమనార్హం. నితీష్‌కుమార్ 2000 మార్చి 3న బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎం అయ్యారు.
అదేవిధంగా బీజేపీతో కలిసి ఇప్పటి వరకు 2000, 2005, 2010, 2017, 2020 ఎన్నికల్లో మొత్తం ఐదు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరో మూడు సార్లు ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి 2015 ఫిబ్రవరిలో ఒకసారి, 2015 నవంబర్‌లో మరొకసారి, 2022లో ఒకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు మళ్లీ బీజేపీతో నితీష్‌కుమార్ తొమ్మిదో సారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతున్నారు.
రాష్ట్రంలో తాము మహాకూటమితో పొత్తును తెంచుకోవాలని నిర్ణయించుకున్నామని ఈ సీనియర్ పొలిటీషియన్ గవర్నర్‌తో తెలిపారు. నితీశ్ రాజీనామాకు గవర్నర్ అర్లేకర్ ఆమోదం తెలిపారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరేవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని సూచించారు. అయితే బీజేపీ కూడా ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబడుతున్నట్లు మరో ప్రచారం జరుగుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఏం జరుగుతుందనేది మరి కొన్ని గంటల్లో తేలే అవకాశం ఉన్నది.