బిహార్(Bihar)లో నిర్మాణంలో ఉన్న దేశంలోనే అతిపెద్ద వంతెన(Bridge) కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో మృతిచెందగా పలువురు గాయాలపాలయ్యారు. ఉదయం 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు.
భారత్ మాల ప్రాజెక్టు(Bharat Mala Project)లో భాగంగా బిహార్‌లోని మధుబని, సుపాల్ మధ్య బకూర్ దాదాపు రూ.1200 కోట్ల వ్యయతో వంతెనను నిర్మిస్తున్నారు. మొత్తం 171 పిల్లర్లతో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జిలో ఇప్పటికే 150 పిల్లర్లు నిర్మించారు. పూర్తైన పిల్లర్లపై గర్డర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో 50, 51, 52 పిల్లర్లపై ఏర్పాటు చేసిన గర్డర్లు కూలిపోయాయి.
ఈ ఘటనలో గాయాలపాలైన 15 నుంచి 20మందిని బైక్‌లపై ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. దాదాపు 35 నుంచి 40మంది దాకా శిథిలాల కింద పడి మృతి చెందినట్లు స్థానికులు అంటున్నారు. అయితే మృతులు, గాయపడ్డ వారి వివరాలను అధికారులు ఇంకా నిర్ధారించలేదు.
బ్రిడ్జి నాణ్యత బాగాలేదని ఇదివరకే అధికారులకు ఫిర్యాదు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. గట్టిగా అడిగితే పోలీసులను పంపి ఎవరినీ మాట్లాడకుండా చేసేవారని అంటున్నారు. 10.2కిలో మీటర్లు పొడవు ఉండే ఈ వంతెన పూర్తయితే దేశంలోనే అతిపెద్ద బ్రిడ్జిగా అవతరిస్తుంది. ఇది అసోంలోని భూపేన్ హజారికా వంతెన కంటే కిలోమీటర్ పొడవు ఉంటుంది.