అయోధ్య (Ayodhya)లో ‘రామ్ లల్లా’విగ్రహ ప్రాణప్రతిష్టకు బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ (LK Advani)ని తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ను ఆ పార్టీ మాజీ ఎంపీ, రామ మందిర ఉద్యమ నేత రామ్ విలాస్ వేదాంతి కోరారు. ‘రామ్ లల్లా’సింహాసనంపై కూర్చునే దృశ్యాలను అద్వానీ తన కండ్లతో చూడాల్సిందేనన్నారు.
ఇది కేవలం దేశ కోరిక మాత్రమే కాదని తెలిపారు. ప్రపంచం వ్యాప్తంగా ఉన్న హిందువులందరి కోరిక అని అన్నారు. ఎందుకంటే రామ మందిర ఉద్యమంలో అద్యానీ చాలా కీలక పాత్ర పోషించారన్నారు. బీజేపీ ప్రస్తుతం ఈ స్థాయికి చేరుకోవడానికి పార్టీ సీనియర్ నేతలు అద్వానీ, మురళి మనోహర్ జోషి, దివంగత పీఎం అటల్ బిహారీ వాజ్ పేయిలు చాలా కష్టపడ్డారని వెల్లడించారు.
సోమ్‌నాథ్ నుంచి అయోధ్య వరకు తన ‘రథయాత్ర’ ద్వారా అద్వానీ రామ మందిర ఉద్యమానికి చాలా పెద్ద సహకారాన్ని అందించారని గుర్తు చేశారు. రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరిగే సమయానికి అద్వానీని అక్కడకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని యూపీ ప్రభుత్వాన్ని ముఖ్యంగా సీఎం యోగీ ఆదిత్యనాథ్ ను తాను కోరుతున్నానని చెప్పారు.
అంతకు ముందు శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సీనియర్ నేతలు అద్వానీ, మురళి మనోహర్ జోషీలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలని కోరారు. వారి వయస్సును, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమానికి రావద్దని అద్వానీ, మురళి మనోహర్ జోషీలను కోరామని తెలిపారు.