రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS)కు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా నల్గొండ నియోజక వర్గంలో ఆ పార్టీకి భారీ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. నల్లగొండ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ (Ramesh) బీఆర్ఎస్ ను వీడే యోచనలో వున్నట్టు తెలుస్తోంది. ఆయన తన అనుచర వర్గంతో కలిసి వేరే పార్టీలోకి వెళ్లేందుకు రెడీ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా రమేష్, ఆయన అనుచర వర్గంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి రహస్యంగా భేటీ అయినట్టు తెలుస్తోంది. హస్తం గూటికి చేరేలా వారిని కోమటి రెడ్డి ఒప్పించినట్టు సమాచారం. ఈ క్రమంలో రమేశ్ తో పాటు ఆయన అనుచరులు కౌన్సిలర్లు జెర్రి పోతుల అశ్విని భాస్కర్ గౌడ్, ఖయ్యుమ్ బేగ్, ప్రదీప్ నాయక్ పబ్బు సాయి శ్రీ సందీప్, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు ఆజిజుద్దీన్ బషీర్ ఇతర నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది.
బీసీ సామాజిక వర్గం నేతలకు ఎమ్మెల్యే సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని నేతలు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో మైనార్టీలకు పార్టీలో తగిన ప్రాధాన్యత లభించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రమేశ్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం వాళ్ల మొబైల్ ఫోన్లు సిచ్చాఫ్ వస్తుండటంతో వార్తలకు బలం చేకూరుతోంది.
త్వరలో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నేతృత్వంలో పార్టీలో భారీ చేరికలు ఉంటాయని తెలుస్తోంది. అంతకు ముందు రెండ్రోజుల క్రితం నల్గొండలో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ షాక్ ఇచ్చింది. నల్లగొండ ఎంపీపీ, కాంగ్రెస్ నేతను బీఆర్ఎస్ తన వైపు లాక్కుంది. సరిగ్గా రెండు రోజులకే బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏ నేత ఏ పార్టీలో ఉంటారో, ఎవరు ఎటు జంప్ అవుతారని ఓటర్లు ఆసక్తిగా చూస్తున్నారు.