అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి బీఆర్ఎస్ (BRs)ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. లోక్ సభ సార్వత్రిక ఎన్నికల (lok sabha election 2024)కు ఆ పార్టీ రెడీ అవుతోంది. ఈ ఎన్నికల్లో వీలైనన్నీ ఎక్కువ సీట్లు గెలిచి తమ సత్తా ఏమాత్రం తగ్గలేదని సంకేతాలు ఇవ్వాలని చూస్తోంది. ఈ విజయంతో అటు పార్టీ శ్రేణుల్లోనూ ఆత్మసైర్థ్యాన్ని మరింత పెంచాలని ప్లాన్ చేస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ శ్రేణులు కాస్త నిస్తేజంలోకి వెళ్లాయి. ఈ క్రమంలో పార్టీ శ్రేణుల్లో మళ్లీ ఉత్తేజం నింపేందుకు సన్నాహక సమావేశాలను నిర్వహించాలని బీఆర్ఎస్ యోచిస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ ఖాతాలో 9 ఎంపీ సీట్లు ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో ఆ సీట్లను మరోసారి ఎలాగైనా నిలుపుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది.
ఈ నేపథ్యంలో సన్నాహక సమావేశాలకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధం అవుతోంది. జనవరి 3వ తేదీ నుంచి సన్నాహక సమావేశాలను ప్రారంభించనుంది. ఉత్తర తెలంగాణ జిల్లా నుంచి ఈ సమావేశాలను ప్రారంభించాలని ఆలోచనలు చేస్తోంది. హైదరాబాద్ వేదికగా ఈ సమావేశాలను పార్టీ నిర్వహించనుంది. జనవరి 3న ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ సమావేశాలను ప్రారంభించనున్నారు.
అనంతరం 4న కరీంనగర్, 5న చేవెళ్ల, 6న పెద్దపల్లి, 7న నిజామాబాద్, 8న జహీరాబాద్ లో నిర్వహించనున్నారు. , 9న ఖమ్మం, 10న వరంగల్,11న మహబూబాబాద్, 12న భువనగిరి పార్లమెంట్ సన్నాహాక సమావేశాలు జరగనున్నాయి. సంక్రాంతి అనంతరం16న నల్గొండ, 17న నాగర్ కర్నూలు, 18న మహబూబ్ నగర్, 19న మెదక్, 20న మల్కాజ్ గిరి, 21 సికింద్రాబాద్, హైదరాబాద్ నియోజకవర్గాల సమావేశాలు జరగనున్నాయి.
లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి, ఈ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశాలకు ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలొ ఉండే ముఖ్య నేతలందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించనున్నారు. బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు హాజరు కానున్నారు.
ఈ సమావేశాల్లో పలు అంశాలపై చర్చించనున్నారు. గత ఎన్నికల్లో చేసిన తప్పిదాలు, ఓటమికి గల కారణాలు, రాబోయే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. వీటితో పాటు పార్టీ నేతల, కార్యకర్తలు అభిప్రాయాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్ కార్యాచరణను పార్టీ రూపొందించనుంది.