Telugu News » BRS : కేసీఆర్.. జాతీయ రాజకీయాలు లేనట్టేనా?

BRS : కేసీఆర్.. జాతీయ రాజకీయాలు లేనట్టేనా?

అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ కు అనేక మంది ట్రావెల్ చేశారు. బీఆర్ఎస్ లో చేరడానికి క్యూ కట్టారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ఎవరొచ్చినా గులాబీ కండువా కప్పేసి ఆహ్వానించారు కేసీఆర్.

by admin
kcr-BRS-Party

– అసెంబ్లీ ఎన్నికల ఓటమితో క్యాడర్ లో పెరిగిన నిరాశ
– లోక్ సభ ఎన్నికలకు సమాయత్తం చేస్తున్న గులాబీ పెద్దలు
– ఫోకస్ అంతా తెలంగాణపైనే
– మహారాష్ట్ర, ఆంధ్రాలో కనిపించని యాక్టివిటీ
– కలగానే కేసీఆర్ జాతీయ రాజకీయాలు
– ఈసారన్నా సత్తా చాటకపోతే పార్టీ మనుగడ కష్టమేనా?

తెలంగాణ (Telangana) లో బీఆర్ఎస్ (BRS) అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీలో పార్టీ ఆఫీస్ ను అట్టహాసంగా ప్రారంభించారు కేసీఆర్ (KCR). తాము జాతీయ రాజకీయాలు ఎందుకు చేయకూడదంటూ.. ప్రధాని మోడీ (PM Modi) ని టార్గెట్ చేశారు. ఇదే ఊపులో తెలంగాణ చుట్టుపక్కల రాష్ట్రాల్లో పార్టీని విస్తరించాలని ప్రయత్నాలు చేశారు. కర్ణాటక (Karnataka) లో స్నేహంగా ఉన్న జేడీఎస్ (JDS) తీరు అనుమానంగా ఉండడంతో వైరం పెరిగి.. ఆ రాష్ట్రంపై ఆశలు ఆవిరయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో మహారాష్ట్ర (Maharashtra), ఏపీ (Andhra Pradesh) లోనూ గులాబీ పార్టీకి ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్నా.. ఆ రెండు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ యాక్టివిటీ అంతగా లేకపోవడం చూస్తుంటే అదే అనిపిస్తుంది.

kcr-BRS-Party

 

మహారాష్ట్రలో మౌనం

అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ కు అనేక మంది ట్రావెల్ చేశారు. బీఆర్ఎస్ లో చేరడానికి క్యూ కట్టారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ఎవరొచ్చినా గులాబీ కండువా కప్పేసి ఆహ్వానించారు కేసీఆర్. ప్రత్యేకంగా చేరికల కోసం ఓ షెడ్యూల్ రూపొందించారు. ఆ ప్రకారం నేతలంతా వచ్చి చేరుతూ వచ్చారు. బహిరంగ సభలు పెట్టారు. నాగపూర్ లో పార్టీ ఆఫీస్ ప్రారంభించారు. మహారాష్ట్ర, తెలంగాణలో కలిసి 50 లోక్ సభ సీట్లు గెలిచి… వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో చక్రం తిప్పుతామని ఉబలాటపడి.. ఇప్పుడు ఆ రాష్ట్రం వైపు కన్నెత్తి చూడడం లేదు. లెక్క ప్రకారం మార్చి పదో తేదీన ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కావాలి. కానీ, 20 రోజుల ముందే ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. అంటే, ఫిబ్రవరిలోనే వచ్చే ఛాన్స్ ఉంది. ఇలాంటి కీలక సమయంలో కేసీఆర్ మహారాష్ట్రను వదిలేసినట్టేనని అంటున్నారు. ముందు తెలంగాణలో పరువు నిలుపుకోకపోతే.. పార్టీ నిర్వీర్యం అయిపోతుందని భావిస్తున్నట్టు సమాచారం.

ఆంధ్రాలో పార్టీ ఉన్నట్టేనా?

ఆంధ్రాలో వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ తో మంచి సాన్నిహిత్యం కొనసాగించారు కేసీఆర్. వీళ్ల స్నేహం చూసి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. జగన్ సహకారంతో రాష్ట్రంలో కొన్ని పార్లమెంట్ స్థానాలు బీఆర్ఎస్ ఖాతాలో పడతాయనే వార్తలు వచ్చాయి. ఒకరొనకరు సహకరించుకునేలా ఇద్దరు నేతలు ముందుకు వెళ్తున్నారని అంతా అనుకున్నారు. అయితే.. జగన్ కు ఢిల్లీ నుంచి పలుమార్లు పిలుపు రావడంతో తర్వాత కేసీఆర్ కు దూరం అయ్యారు. అదీగాక, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అంతా తారుమారు అయింది. ఆంధ్రాలో బీఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర్ కూడా అంతగా యాక్టివ్ గా లేరు. అసలు, బీఆర్ఎస్ అనేది ఒకటుందనే చర్చ కూడా జనంలో జరగడం లేదు. లోక్ సభ ఎన్నికల విషయంలో ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తుందా? లేదా? అనే డౌట్ సర్వత్రా వ్యక్తం అవుతోంది.

తెలంగాణపైనే ఫుల్ ఫోకస్.. రంగంలోకి కేటీఆర్

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో పార్లమెంట్ ఎలక్షన్లలో పోటీ చేయాలా..? వద్దా..? అనే మీమాంస బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీల్లో నెలకొంది. ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌ నగర్‌ జిల్లాల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం పాలైంది. అసెంబ్లీ ఎన్నికల్లోనే ఓట్లు రాకపోతే ఆయా జిల్లాల్లో లోక్ సభ ఓట్లు వస్తాయనేది డౌటే. అందుకే, సిట్టింగులు పోటీకి వెనుకడుగు వేస్తున్నారు. మెదక్ నుంచి కేసీఆర్ పోటీ చేస్తారని అంటున్నారు. మిగిలిన చోట్ల అభ్యర్థుల ఎంపికపై కేటీఆర్ కసరత్తులు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు జరుపుతున్నారు. కేసీఆర్ రెస్ట్ తీసుకుంటుండడంతో అన్నీ తానై నడిపిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లోనైనా సత్తా చాటా పరువు నిలుపుకోవాలనే వ్యూహరచనలో ఉన్నారు.

You may also like

Leave a Comment