బీఆర్ఎస్ (BRS) లో అసంతృప్తి సెగలు రగులుతూనే ఉన్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ లీడర్లు కేసీఆర్ (KCR) కు గుడ్ బై చెబుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు రాజీనామా చేయగా.. తాజాగా అదే బాటలో నడిచారు మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ (Chittaranjan Das). ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ (Jaipal Yadav) వైఖరి పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. పలు సందర్భాల్లో బహిరంగంగా విమర్శలు చేసిన ఈయన.. చివరకు బీఆర్ఎస్ ను వీడారు.
వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కే టికెట్ ఇవ్వడంతో జీర్ణించుకోలేకపోయారు. తనకు గానీ, బీసీ నేతలలో ఒకరికి గానీ టికెట్ ఇవ్వాలని చాలాకాలంగా ఈయన పోరాడుతున్నారు. అధిష్టానం దీన్ని పట్టించుకోకుండా జైపాల్ యాదవ్ కే టికెట్ కేటాయించింది. దీంతో శుక్రవారం పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాదు.. తాను బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన నేతగా గుర్తింపు పొందారు చిత్తరంజన్ దాస్. 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుండి పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావును ఓడించారు. అంతకుముందు 1985 ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో పర్యాటక, కార్మిక శాఖ మంత్రిగా.. జనార్దన్‌రెడ్డి ప్రభుత్వంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. 1999లో కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో టీడీపీలో చేరారు. ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్ లో చేరి ఓబీసీ సెల్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. 2009 ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి పీఆర్పీ టికెట్ పై పోటీ చేసి మళ్లీ కాంగ్రెస్ లోకి వెళ్లారు. అయితే.. 2018లో కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో 2019లో సార్వత్రిక ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్ లో చేరారు.
ఈసారి కల్వకుర్తి రేసులో అడుగుపెట్టాలని భావించినా.. సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కే టికెట్ దక్కింది. దీంతో బీజేపీలో చేరాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే బీజేపీ ముఖ్య నాయకులు చర్చలు జరిపి.. తమ పార్టీలోకి వస్తే తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్, తల్లోజు ఆచారి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. సానుకూలంగా స్పందించిన చిత్తరంజన్ దాస్.. అక్టోబర్ 1న మహబూబ్ నగర్ లో వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోనున్నారు.