Telugu News » KTR : తప్పు ఎవరిది..? శిక్ష ఎవరికి..?

KTR : తప్పు ఎవరిది..? శిక్ష ఎవరికి..?

ధరణి, దళితబంధు, నియంతృత్వ విధానాలు పార్టీ ఓటమికి కారణం అయింది వాస్తవం కాదా? ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు ప్రజల్లో అప్రతిష్ట తెచ్చిపెట్టింది నిజం కాదా? ఇంకా చెప్పుకుంటూ పోతే పెద్దల వైఫల్యాలు చాలానే ఉన్నాయి. ఇవన్నీ ఆలోచించకుండా.. తప్పంతా మనమే చేశామన్నట్టు కేసీఆర్ ఫ్యామిలీ మాట్లాడుతుండడంపై గులాబీ నేతలు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.

by admin
brs

– బీఆర్ఎస్ ఓటమికి కారణం ఎవరు?
– పార్టీ నేతలపై తోసేస్తున్న కేటీఆర్, కవిత
– పార్లమెంట్ సన్నాహక సమావేశాల్లో ఒకటే పాట
– తప్పంతా మీదేనంటూ నేతలకు క్లాసులు
– గెలిస్తే క్రెడిట్ అంతా మీదా?
– ఓడిపోతే మాపై తోసేస్తారా?
– పదేళ్ల పాలనపై అసంతృప్తి లేదనుకుంటున్నారా?
– ఒకరితో ఒకరు మొర పెట్టుకుంటున్న గులాబీలు

లోక్ సభ ఎన్నికల పోరుకు బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) వ్యూహరచనలో ఉన్నాయి. ఉడుం పట్టులా ఉన్న బీజేపీ.. పరువు కాపాడుకునే పనిలో బీఆర్ఎస్.. గత వైభవాన్ని పొందాలనే ఆరాటంలో కాంగ్రెస్.. ఇలా ఎవరికి వారే తమ అస్త్రాలకు పదును పెడుతున్నాయి. అయితే.. బీఆర్ఎస్ పెద్దల మాటలు కొంప ముంచేలా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. పార్లమెంట్ సన్నాహక సమావేశాల సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీ ఎన్నికల ఓటమిపై పదేపదే మాట్లాడుతున్నారు. సిట్టింగులను మార్చి ఉండాల్సిందని.. తప్పంతా నేతలపై తోసేసే ప్రయత్నం చేస్తున్నారు.

ktr key comments on ts assembly elections defeat

ఇటు ఎమ్మెల్సీ కవిత సైతం తాజాగా ఇవే వ్యాఖ్యలు చేశారు. దీంతో గులాబీలు పాత విషయాలపై ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారని సమాచారం. ధరణి, దళితబంధు, నియంతృత్వ విధానాలు పార్టీ ఓటమికి కారణం అయింది వాస్తవం కాదా? ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు ప్రజల్లో అప్రతిష్ట తెచ్చిపెట్టింది నిజం కాదా? ఇంకా చెప్పుకుంటూ పోతే పెద్దల వైఫల్యాలు చాలానే ఉన్నాయి. ఇవన్నీ ఆలోచించకుండా.. తప్పంతా మనమే చేశామన్నట్టు కేసీఆర్ ఫ్యామిలీ మాట్లాడుతుండడంపై గులాబీ నేతలు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. అధికారం కోల్పోయి నెల దాటినా.. ఓటమికి అసలు కారణాలపై పోస్టుమార్టం చేయకుండా.. లోక్ సభ ఎన్నికలకు సమాయత్తం అవుతున్న వేళ.. ఇతర నేతలపై తప్పంతా తోసేస్తుండడం కరెక్ట్ కాదనే చర్చ పార్టీలో జరుగుతోంది.

ఈ సందర్భంగా కేసీఆర్ మాటలను గుర్తు చేసుకుంటున్నారు గులాబీలు. ఎన్నికల ప్రచారంలో తనను, పార్టీని చూసి ఓటెయ్యాలని జనానికి పిలుపునిచ్చారని.. అలాంటిది ఓటమికి తప్పంతా ఇతరులపై నెట్టేయడం కరెక్ట్ కాదేమో అని అనుకుంటున్నారట. మరోవైపు, ఇవేమీ పట్టించుకోకుండా పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునివ్వడం ఆశ్చర్యంగా అనిపిస్తోందని గులాబీ నేతలు మాట్లాడుకుంటున్నట్టు సమాచారం. సోమవారం తెలంగాణ భవన్‌ లో నిజామాబాద్ లోక్‌ సభ స్థానం సన్నాహక సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న కేటీఆర్.. నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం, ఢిల్లీలో గులాబీ జెండా ప్రాతినిథ్యం ఉండాల్సిందేనని అన్నారు.

నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఓట్ల పరంగా బీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. లోక్‌ సభ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉందని వెల్లడించారు. బీఆర్ఎస్‌ కు గెలుపు ఓటములు కొత్త కాదని గుర్తు చేశారు. పేదలు, దళితులు, బీసీల ప్రయోజనాలకు దెబ్బకొట్టేలా కుట్ర చేస్తే, బీఆర్ఎస్‌ తరఫున కొట్లాడుదామని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ అడ్డగోలుగా 420 హామీలు ఇచ్చిందని విమర్శించారు. పేద ప్రజల కోసం ఉద్దేశించిన అనేక సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. అదే జరిగితే ఆయా లబ్ధిదారులతో కలిసి తమ పార్టీ పోరాటం చేస్తుందని కేటీఆర్ తెలిపారు.

You may also like

Leave a Comment