కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLA’s) పాడి కౌశిక్ రెడ్డి, మాణిక్ రావు సీరియస్ కామెంట్స్ చేశారు. గురువారం కేసీఆర్(KCR) ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం తర్వాత వారు మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారని, కొత్త ఇన్నింగ్స్ మొదలు కాబోతోందన్నారు. రెడీ ఉండండి.. ఇక రేవంత్ ఆటలు సాగవంటూ హెచ్చరించారు.
ఉద్యోగాలపై సీఎం రేవంత్‌రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఫిబ్రవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ వేస్తామని, ఇంతవరకు స్పందించడంలేదంటూ విమర్శించారు. ఇచ్చిన మాట ప్రకారం వెంటనే రెండు లక్షల ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్‌ను బొంద పెడతామని సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడొచ్చా? అంటూ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, మాణిక్ రావు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కొంచెం సీఎంలా ప్రవర్తించడం నేర్చుకోవాలని హితవు పలికారు. కేసీఆర్ పనితీరు రాష్ట్రమంతా తెలుసని, కాంగ్రెస్ ముందు గ్యారంటీల అమలపై దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్ర ప్రజలు ఎవరూ 200యూనిట్ల వరకు కరెంట్ బిల్లు కట్టొద్దని పిలుపునిచ్చారు.
రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు ఏమైనా పోలిక ఉందా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయంలో హరీశ్‌రావు చేసిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటుందని అన్నారు. హరీశ్‌రావు ఉదయం 6 గంటలకు నుంచి రాత్రి 2 గంటల వరకు ప్రజల్లో ఉండే వ్యక్తి అని, అలాంటి నాయకుడితో ఎవరితోనూ పోలిక ఉండదన్నారు. కేవలం హరీశ్‌రావు కృషి వల్లే నర్సులకు ఉద్యోగాలు వచ్చాయని ఎమ్మెల్యేలు చెప్పుకొచ్చారు.