– తెర పైన కుస్తీ.. వెనుకేమో దోస్తీ
– ఎన్నికలు దగ్గర పడుతుండడంతో..
– బయటపడుతున్న చీకటి బంధాలు
– ప్రతీసారీ ఇదే తంతు
– బీఆర్ఎస్, ఎంఐఎం ఎలక్షన్ డ్రామా!
– రేవంత్ ను టార్గెట్ చేయడం వెనుక కారణాలేంటి?
హైదరాబాద్ (Hyderabad) తప్ప ఎక్కడా పెద్దగా మనుగడ లేని పార్టీ ఎంఐఎం (MIM). కొన్ని రాష్ట్రాల్లో అక్కడక్కడా ఓట్లు రాబడుతున్నా.. సీట్లు పెరిగింది తక్కువే. తెలంగాణ (Telangana) రాష్ట్రం ఏర్పడ్డాక గులాబీ పార్టీకి దగ్గరయింది. మొదట్నుంచి కాంగ్రెస్ (Congress) నీడలో మనుగడ సాగించిన ఎంఐఎం.. తమ ప్రధాన టార్గెట్ బీజేపీ 9BJP) అని చెప్పుకుంటున్నా.. కార్యాచరణలో మాత్రం కాంగ్రెస్ అని స్పష్టంగా అర్థం అవుతోందని అంటున్నారు రాజకీయ పండితులు. తాజాగా జరుగుతున్న కొన్ని పరిణామాలను అంచనా వేసి.. బీఆర్ఎస్ (BRS), ఎంఐఎం గొడవలన్నీ డ్రామాగా తేల్చేస్తున్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో కొనసాగింది. బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తామని ఎంఐఎం నేతలు తెగ మాట్లాడారు. కేటీఆర్ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయి హీట్ పెంచారు. దీంతో బీఆర్ఎస్, ఎంఐఎం శత్రుత్వం కొనసాగుతుందని అంతా అనుకుంటే.. రిజల్ట్స్ తర్వాత ఒక్కటయ్యాయి రెండు పార్టీలు. ఎంఐఎం సపోర్ట్ తో మేయర్ పీఠాన్ని కాపాడుకుంది బీఆర్ఎస్. అయితే.. త్వరలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మరోసారి బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య ఒప్పందం జరిగిందనే ప్రచారం జరుగుతోంది.
కర్ణాటక ఎన్నికల విజయంతో ఊపుమీదున్న కాంగ్రెస్.. తెలంగాణలోనూ పాగా వేయాలని చూస్తోంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీలను ప్రకటించి జనంలోకి వెళ్తోంది. అక్కడ వర్కవుట్ అయిన ఫ్రీ స్కీముల ప్లాన్.. తెలంగాణలోనూ వర్కవుట్ అవుతుందని గట్టిగా నమ్ముతోంది. అయితే.. కాంగ్రెస్ గ్యారెంటీలను నమ్మొద్దని మంత్రి కేటీఆర్ పదే పదే చెబుతున్నారు. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రేవంత్ ఆరఎస్ఎస్ మనిషని.. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని విమర్శల దాడి చేస్తున్నారు. తాజాగా ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా ఇదే రాగం అందుకున్నారు. రేవంత్ ఆర్ఎస్ఎస్ మనిషి అంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు.
ఎంఐఎం పోటీ చేసే స్థానాలు మినహా మిగిలిన నియోజకవర్గాల్లో ముస్లింలు బీఆర్ఎస్ కే ఓటు వేయాలని అసదుద్దీన్ ఆల్రడీ స్టేట్ మెంట్ ఇచ్చేశారు. అయితే.. మైనార్టీలు ఆయన మాట వింటారో లేదో అనే డౌట్ తో రేవంత్ పాత చరిత్రను తిరగేస్తూ విమర్శల దాడి చేస్తున్నారని అంటున్నారు రాజకీయ పండితులు. ఎందుకంటే, ఈసారి మైనార్టీ వర్గాలు కాంగ్రెస్ వైపు చూస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. అందుకే, కాంగ్రెస్ పై మాటల దాడి చేసి.. ముస్లిం ఓటర్లను అటు వైపు వెళ్లకుండా చేయాలని బీఆర్ఎస్, ఎంఐఎం ప్లాన్ చేశాయని అంటున్నారు.
ఒకప్పుడు అత్యధికంగా మైనారిటీ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ వెంటే ఉండేది. దీనికి ముఖ్య కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ తీసుకురావడంతో.. గంపగుత్తగా ఓట్లు కాంగ్రెస్ కు పడుతూ వచ్చాయి. ఆ తరువాత ఆ ఓటు బ్యాంక్ చీలిపోయి.. ఎక్కువగా బీఆర్‌ఎస్ కు షిఫ్ట్ అయింది. అయితే, మైనారిటీ ఓటర్లను తమవైపు తిప్పుకోడానికి కాంగ్రెస్ ఎప్పటి నుంచో ప్రణాళికలు రచిస్తోంది. ఎంఐఎం మాటలు నమ్మొద్దని చెబుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఓల్డ్ సిటీకి చెందిన మస్కతి డెయిరీ చైర్మన్ అలీ బిన్ ఇబ్రహీంని పార్టీలో చేర్చుకుంది. పాతబస్తీలో స్థానికంగా పలుకుబడి ఉన్న మహ్మద్ అయూబ్ ఖాన్ తన కుమారులు షాబాజ్ ఖాన్, అర్బాజ్ ఖాన్ తో కలిసి పార్టీలో చేరారు. మరికొంత మంది నాయకులను పార్టీలో చేర్చుకునేలా కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో ప్రమాదాన్ని గ్రహించే కాంగ్రెస్ పై బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి ఎటాక్ మొదలు పెట్టాయని అంటున్నారు విశ్లేషకులు.