లైవ్ డిబేట్ లో ఉన్నప్పుడు ప్రత్యర్థులు ప్రశ్నలు వేయడం సహజం. కుదిరితే వాటికి సమాధానం చెప్పాలి. లేదంటే గమ్మునుండిపోవాలి. కానీ, కుత్బుల్లాపూర్ (Quthbullapur) బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే వివేకానంద (Vivekananda) రెచ్చిపోయారు. తన రూటే సపరేటు అంటూ ప్రత్యర్థిపై దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
కుత్బుల్లాపూర్ లో గెలుపెవరిది అంటూ ఓ ఛానల్ లైవ్ డిబేట్ నిర్వహించింది. దీనికి ఎమ్మెల్యే వివేకానంద, కాంగ్రెస్ అభ్యర్థి హన్మంత రెడ్డి (Hanmantha Reddy), బీజేపీ నేత కూన శ్రీశైలం గౌడ్ (Srisailam Goud) హాజరయ్యారు. ముగ్గురు నేతలు.. ప్రజలు, డిబేట్ నిర్వాహకుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అయితే.. ఎమ్మెల్యే వివేకానంద.. హన్మంత రెడ్డి, శ్రీశైలం గౌడ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన శ్రీశైలం గౌడ్, మండల ప్రెసిడెంట్ గా చేసిన హన్మంత రెడ్డి.. ప్రజలకు మంచి చేసి ఉంటే గెలిచే వాళ్లని అన్నారు.
గత ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయారంటూ విమర్శలు చేశారు వివేకానంద. ఈ క్రమంలో పది కోట్లకు అమ్ముడుపోయింది ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు శ్రీశైలం గౌడ్. తాను ఇండిపెండెంట్ గా గెలిచానని చెప్పారు. దమ్ముంటే ఎన్నికల్లో చూసుకుందామంటూ వివేకానంద సవాల్ చేశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఎవరి తప్పుల్ని వారు ఎత్తి చూపుతూ.. భూకబ్జాలు చేశారంటూ ఒకర్నొకరు తిట్టుకున్నారు. వివేకానంద సహనం కోల్పోయారు. శ్రీశైలం గౌడ్ మెడ పట్టుకుని దాడి చేశారు.
ఈ ఘటనతో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు కూడా రెచ్చిపోయారు. స్టేజీ మీదకు దూసుకొచ్చారు. కుర్చీలు, ఫ్లెక్సీలను పైకి ఎగురవేస్తూ నానా రచ్చ చేశారు. పోలీసులు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు.