– గవర్నర్ తీరు బాధాకరం
– బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీ
– గవర్నర్ తీరు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం
– రాజ్యాంగ పదవిలో ఉండి ఇలా చేస్తారా?
– తమిళిసైపై కవిత ఫైర్
నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవుల విషయంలో ప్రగతి భవన్ (Pragati Bhavan), రాజ్ భవన్ (Raj Bhavan) మధ్య వార్ జరుగుతోంది. గవర్నర్ తమిళిసై (Tamilisai) నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు గులాబీ నేతలు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) స్పందిస్తూ.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ తీరు బాధాకరమన్న ఆమె.. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ ఇలా ప్రవర్తించడం సరికాదన్నారు. బీజేపీ (BJP) బీసీ వ్యతిరేక పార్టీ అని అర్థం అవుతోందని మండిపడ్డారు.
గవర్నర్ తీరు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్నారు కవిత. ప్రభుత్వం పంపిన జాబితాను ఆమోదించడం సంప్రదాయమని గుర్తు చేశారు. దీనికి విరుద్ధంగా అనేక కారణాలు చెప్పి ప్రభుత్వం పంపిన పేర్లను తిరస్కరించడం దేనికి సంకేతమని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రాల్లో భారత రాజ్యాంగం నడుస్తోందా? లేదా బీజేపీ రాజ్యాంగం నడుస్తోందా? అని ప్రశ్నించారు. గవర్నర్లే ఇలా వ్యవహరించడం దురదృష్టకరమని.. రాజ్యాంగ వ్యవస్థలకు పరిధులు, పరిమితులు ఉంటాయని తెలిపారు.
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు అసెంబ్లీ హాలులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కవిత.. ఐలమ్మకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్ట్ ను గవర్నర్ తిరస్కరించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పలు రాష్ట్రాల్లో గవర్నర్ల వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులకు కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ లను ఎంపిక చేసింది కేబినెట్. ఆమోదం కోసం గవర్నర్ తమిళిసై దగ్గరకు పంపగా.. ఆమె తిరస్కరించారు. రాజకీయాలతో సంబంధం లేని అర్హులనే సిఫార్సు చేయాలని సీఎం, సీఎస్ లకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు గవర్నర్ నిర్ణయం పట్ల మండిపడుతున్నారు. మంత్రి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డిలు తమిళిసై తీరును తప్పుబట్టారు. తాజాగా కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.