పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా బీఆర్ఎస్ (BRS) సంగారెడ్డి (Sangareddy)లో16 తేదీన మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశాలు నిర్వహించడానికి సిద్దం అవుతుంది. ఈ నేపథ్యంలో బహిరంగ సభ ఏర్పాట్ల పై జహీరాబాద్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao).. కార్యకర్తలకు కీలక సూచనలు చేస్తూనే.. కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు..
బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్‌లకు మద్దతుగా సంగారెడ్డిలో జరిగే బహిరంగ సభకు భారీగా రావాలని కార్యకర్తలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.. అలాగే కేసీఆర్ సైతం ఈ సభకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.. ఇప్పటికే కరీంనగర్, చేవెళ్ల సభలు విజయవంతంగా జరిగాయని వెల్లడించిన హరీష్ రావు.. అదే స్ఫూర్తితో సంగారెడ్డి సభ విజయవంతం చేయాలని కోరారు..
మరోవైపు బీజేపీ పదేళ్ల పాలనపై, కాంగ్రెస్ నాలుగు నెలల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆరోపించిన ఆయన.. కేసీఆర్ పాలనకు, కాంగ్రెస్ పాలనకు తేడాను ప్రజలు గమనించాలని సూచించారు.. జనం మోసం చేసిన కాంగ్రెస్‌పై తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు పేర్కొన్న హరీష్ రావు.. పార్లమెంటు ఎన్నికల్లో కసి తీర్చుకుని బుద్ధి చెప్పాలని ఓటర్లు ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు..
అలాగే బీజేపీ పాలనలో ఏ ఒక్క వర్గానికి కూడా మేలు జరగలేదు. పెట్రోల్, డీజిల్, సిలిండర్ ధరలు భారీగా పెరిగాయని విమర్శించారు.. మొత్తం 150 మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన కేంద్రం.. రాష్ట్రానికి ఒక్కటి కూడా ఇవ్వలేదు. నవోదయ కాలేజీలు సైతం ఇవ్వలేదని మండిపడ్డారు.. అదేవిధంగా 20 కోట్ల ఉద్యోగాలిస్తామన్న బీజేపీ 6 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని విమర్శించారు.. ఇలాంటి పార్టీకి ఓట్లేయడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు..
మరోవైపు కాంగ్రెస్ పాలనలో కొత్త స్కీంలు రాలేదు గాని కోతల స్కీంలు వచ్చాయని ఎద్దేవా చేసిన హరీష్ రావు.. ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయిన రైతులు వడ్లను తమ కల్లాల్లోనే 1700కు అమ్ముకుంటున్నారన్నారు.. రైతులకు అభయ హస్తం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ రిక్తహస్తం చూపిందని వ్యంగ్యంగా మాట్లాడారు.. రైతులకు ఇచ్చిన హామీలపై నేను చర్చకు సిద్ధం. కాంగ్రెస్ వైపు నుంచి ఎవరు వస్తారో రావాలంటూ సవాల్ విసిరారు..