అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి.. అనంతరం కేసీఆర్ సిక్ అవడం చకా చకా జరిగిపోయాయి. అప్పటి నుంచి అజ్ఞాత వాసంలో ఉండి రెస్ట్ మోడ్ లోకి వెళ్ళిన కేసీఆర్ రాజకీయాల్లో మళ్ళీ వెలుగుతారా? లేదా? అనే అనుమానాలు కలిగాయి.. బీఆర్ఎస్ (BRS) మనుగడపై సందేహాలు వరదలా పొంగాయి.. అయితే ఇప్పుడిప్పుడే చేతికర్ర సాయంతో నడుస్తున్న ఆయన.. పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నారు..
ఈ నేపథ్యంలో రాబోయే పార్లమెంటరీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు బీఆర్ఎస్ నేతలు సమావేశం అయ్యారు. సిద్దిపేట (Siddipeta) జిల్లా, ఎర్రవల్లి (Erravalli)లోని ఫాం హౌస్ లో, పార్టీ అధినేత కేసీఆర్ (KCR) నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు, కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది.
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్ సభాపక్షనేత నామా నాగేశ్వరరావుతో పాటు ఎంపీలు, కేటీఆర్, హరీష్ రావులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరోవైపు ఈ నెల 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యి, ఫిబ్రవరి 9 వరకూ కొనసాగుతాయి. రాబోయే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది.
బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా.. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడతారు. కాగా తుంటి మార్పిడి శస్త్ర చికిత్స జరిగిన అనంతరం తొలిసారిగా కేసీఆర్.. పార్టీ నేతలతో సమావేశం
అయ్యారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించేలా బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది.