బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLAS)లకు వరుసగా నిరసన సెగలు తగులుతున్నాయి. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా నిన్న నంది పేట మండలం సీహెచ్ కొండూరులో గ్రామస్తులు నిరసన తెలిపారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య (Kale Yadaiah) కు చేదు అనుభవం ఎదురైంది.
రంగారెడ్డి జిల్లా మొయినా బాద్ మండల పరిధిలోని నక్కల పల్లికి ఎన్నికల ప్రచారం నిమిత్తం ఎమ్మెల్యే యాదయ్య వెళ్లారు. ఎమ్మెల్యే రాకను గమనించి గ్రామస్తులు అడ్డుకున్నారు. గత ఎన్నికల సమయంలో గ్రామాని అభివృద్ధి చేస్తామంటూ ఎన్నో హామీలు ఇచ్చారని గ్రామస్తులు అన్నారు. కానీ ఇప్పటి వరకు వాటిని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారంటూ ఎమ్మెల్యేపై గ్రామస్తులు మండిపడ్డారు.
ఇచ్చిన హామీలను నెర వేర్చకుండా ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని గ్రామానికి వస్తున్నారంటూ ఎమ్మెల్యేను గ్రామస్తులు నిలదీశారు. మండలంలో ఒక్క జూనియర్ కళాశాల ఏర్పాటు చేయించలేకపోయిన అసమర్థ ఎమ్మెల్యే అంటూ కాలే యాదయ్యపై గ్రామస్తులు ఫైర్ అయ్యారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కనీసం రేషన్ కార్డులు ఇవ్వలేదని, ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. గ్రామస్తులు అడిగిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండానే ఎమ్మెల్యే అక్కడి నుంచి వెనుదిరిగారు.