మోసపూరిత హామీలతో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. పదేండ్లలో కరెంట్ పోలేదని తెలిపారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ రాగానే కరెంట్ పోతోందని మండిపడ్డారు. నగరంలో జరిగిన అభివృద్ధి చూసి గ్రేటర్‌లో బీఆర్‌ఎస్‌కు ప్రజలు పట్టం కట్టారని ఆయన తెలిపారు.
కూకట్‌పల్లిలో బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. ఫ్రీ బస్సు సౌకర్యంతో మహిళలు కొట్లాడుకుంటున్నారని అన్నారు. ఆ పథకం మంచిదేనన్నారు. కానీ దానికి తగ్గట్టుగా బస్సుల సంఖ్యను పెంచాలని సూచించారు. అదే సమయంలో ఆటో కార్మికులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
డిసెంబర్ 9న రైతులంతా రుణాలు తెచ్చుకోవాలని చెప్పారనీ, కానీ ఇప్పటి వరకు ఎలాంటి రుణ మాఫీ చేయలేదన్నారు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది ఇప్పుడు ఫిబ్రవరి 9 కూడా వచ్చిందన్నారు. ఇంకా రుణమాఫీ కాలేదంటూ ఎద్దేవా చేశారు. రైతులకు 500 రూపాయల బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇంకా ఇవ్వలేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని అంటున్నారని మండిపడ్డారు. పదేండ్ల పాటు తమకు మోడీ సహకరించకపోయినప్పటికీ తాము ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చామన్నారు. ప్రజల తరుపున పోరాటం చేసేందుకు బీఆర్‌ఎస్ ఎప్పుడూ ముందుంటుందని వెల్లడించారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి లబ్దిచేకూరే వరకు పోరాడుతామన్నారు.
29 వేల లీటర్ల వరకు మంచి నీటిని ఉచితంగా ఇచ్చిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ అని తెలిపారు. ఇప్పుడు మంచి నీటికి చార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. 70 ఏండ్ల వ్యక్తి కేసీఆర్‌ను నోటి కొచ్చినట్లు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. సీఎం స్థాయి మరిచి కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి 17 తర్వాత రేవంత్ రెడ్డికి గట్టి సమాధానం ఇస్తామన్నారు.