బీఆర్ఎస్ (BRS) ను ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ (Congress) గూటికి చేరారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ (Ponguleti Srinivas) రెడ్డి. ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించి రాహుల్ గాంధీ (Rahul Gandhi) సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రానివ్వనని శపథం చేశారు. అయితే.. పొంగులేటికి ముఖ్య అనుచరుడు తెల్లం వెంకట్రావు (Tellam Venkatrao) ఝలక్ ఇచ్చారు. హైదరాబాద్ (Hyderabad) లో మంత్రి కేటీఆర్ (KTR) సమక్షంలో ఆయన బీఆర్ఎస్ గూటికి చేరారు.
తెలంగాణ భవన్ లో చేరికల సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ మునిగిపోయే నావ అని విమర్శించారు. ఈ విషయాన్ని తెల్లం వెంకట్రావు తొందరగా గ్రహించారని అన్నారు. ఆయన రాజకీయ భవిష్యత్ కు తమది భరోసా అని హామీ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ను నమ్మితే కుక్క తోక పట్టుకున్నట్లేనంటూ సెటైర్లు వేశారు. జల్-జంగల్-జమీన్ విషయంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోండి అంటూ హితవు పలికారు. తెలంగాణలో కోటి ఎకరాల్లో సాగు జరుగుతోందని అన్నారు.
తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి జరుగుతోందని చెప్పారు కేటీఆర్. కాంగ్రెస్ నేతలు ఏదేదో చెబుతున్నారని.. తెలంగాణలో అమలువుతున్న పథకాలు.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉందా? అని ప్రశ్నించారు. ఏం చూసి కాంగ్రెస్ ను ఆదరించాలని అడిగారు. ‘‘భద్రాద్రిలో రెండు హామీలు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని.. ఒకటి భద్రాద్రి రామాలయం అభివృద్ధి.. రెండోది కరకట్టల నిర్మాణం.. మళ్లీ మనమే వచ్చేది. బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. అన్నీ చేసుకుందాం’’ అని తెలిపారు.
ఇక తెల్లం వెంకట్రావు 2014లో మహబూబాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ ఇంచార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018 సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. కొన్నినెలల నుంచి పొంగులేటితో కలిసి తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించారు. ఇప్పుడు తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరారు.