కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప(BS Yediyurappa)పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఓ మైనర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 17ఏళ్ల ఆ బాలిక తల్లి ఫిర్యాదుతో బెంగళూరులోని సదాశివనగర్ పోలీసులు పోక్సో చట్టం (POCSO Act) కింద కేసు నమోదు చేశారు.
ఫిబ్రవరి 2న ఓ చీటింగ్ కేసులో సహాయం కోరేందుకు తన 17 ఏండ్ల కుమార్తెతో కలిసి యడియూరప్ప దగ్గరకు వెళ్లామని, ఆ సమయంలో లైంగిక దాడి జరిగినట్లు బాలిక తల్లి ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఈ విషయమై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఇప్పటివరకు స్పందించలేదు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆయనపై ఈ ఆరోపణలు రావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. 2008-2011 మధ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2018లో కొద్ది రోజుల పాటు, ఆ తర్వాత జూలై 2019-2021 మధ్య మరోసారి సీఎంగా పనిచేశారు.
2021, జులైలో బీజేపీ అధిష్టానం యడియూరప్పను సీఎం పదవి నుంచి తప్పించింది. తర్వాత బీజేపీ అధిష్టానం యడియూరప్పను తప్పించి జూలై 2021లో బస్వరాజ్ బొమ్మైను సీఎంగా చేసింది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో బీజేపీ ప్రభుత్వం దిగిపోయింది.
తాజాగా, పోక్సో కేసుపై కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప స్పందించారు. రెండు నెలల కిందట తల్లి, కూతురు ఓ కేసు విషయంతో తన ఇంటికి వచ్చిన విషయం వాస్తవమేనన్నారు. అయితే, కష్టాల్లో ఉన్నందున వారికి డబ్బు ఇచ్చానని, ఆ తర్వాత పోలీస్ కమిషనర్‌కు ఫోన్ చేసి ఈ విషయంపై మాట్లాడినట్లు చెప్పారు. అనూహ్యంగా తనకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడంతో ఆశ్చర్యపోయానన్నారు.
ఇలాంటివి తాను ఊహించలేదని, వీటిని ఎదుర్కొంటానని పేర్కొన్నారు. కేసులు పెట్టిన బాలిక మానసిక స్థితి బాగా లేదన్నారు. ఆమె ఇప్పటికి ఇలాంటివి 32 సార్లు ఫిర్యాదులు చేసిందని వెల్లడించారు. ఈ కేసు వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా? లేదా? అనేది చెప్పలేనన్నారు. ఏం జరుగుతుందో చూద్దామని తెలిపారు.