సంగారెడ్డి(Sangareddy) గీతం యూనివర్సిటీ(Githam University) లో దారుణం జరిగింది. కాలేజీలో బీటెక్ చదువుతున్న విద్యార్థిని(Btech Student) ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. యూనివర్సిటీలో చేరిన మూడు నెలలకే రేణుశ్రీ అనే విద్యార్థిని అందరూ చూస్తుండగానే కాలేజీ బిల్డింగ్ ఐదో అంతస్తు పైకి ఎక్కింది. వెంటనే అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మేరకు పటాన్ చెరు డీఎస్పీ పురుషోత్తం రెడ్డి విద్యార్థిని ఆత్మహత్యకు సంబంధించి వివరాలు వెల్లడించారు. రేణుశ్రీ గీతం యూనివర్సిటీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ చదువుతోంది. శుక్రవారం మధ్యాహ్నం తర్వాత యూనివర్సిటీలోని క్యాంపస్‌లో బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
ఘటనాస్థలంలోనే రేణుశ్రీ మృతిచెందినట్లు డీఎస్పీ స్పష్టం చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. అయితే, ఇంతవరకు రేణుశ్రీ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు. రేణుశ్రీ ఫోన్‌ను సీజ్ చేసి చివరిసారిగా ఆమె ఎవరితో మాట్లాడింతో ఆరా తీస్తున్నట్లు తెలిపారు.
విద్యార్థిని ఆత్మహత్యకు కారకులెవరైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మృతురాలు ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్తెగా భావిస్తున్నారు. ఉదయం తనకు ఇష్టమైన చేపల కూర చేయమని కోరిందని.. మధ్యాహ్నం వరకు తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని కాలేజీ నుంచి ఫోన్ వచ్చిందని రేణుశ్రీ తల్లి రోధిస్తూ తెలిపింది.