కేశినేని నాని (Kesineni Nani)పై చీటింగ్ కేసు పెట్టాలని తెలుగుదేశం సీనియర్ నేత (TDP Senior Leader) బుద్ధ వెంకన్న (Buddha Venkanna) అన్నారు. ఆయన ఆదివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేశినేని నానిని చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతోందని విమర్శించారు. రాజకీయాల్లో ఎక్కువ రంగులు మార్చిన చరిత్ర ఆయనదేనని దుయ్యబట్టారు.
2014లో వేసిన అఫిడవిట్లో శ్రీరామ్ చిట్స్(Shriram Chits)కు డబ్బులు ఇవ్వాలని, ఐవోబీకి రూ.30కోట్లు కోట్లు బకాయిలు చెల్లించాలని, 2024 అఫిడవిట్లో కూడా ఇవే అప్పులు రాశారని తెలిపారు. పదేళ్ల కాలంగా ఆ అప్పులు ఎందుకు కట్టలేదని కేశినేని నానిని బుద్ధ వెంకన్న ప్రశ్నించారు. డబ్బులు ఎగ్గొట్టినందుకు, కార్మికులును అన్యాయం చేసినందుకు ఆయననూ చీటింగ్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.
ఈ కేసు విషయం అఫిడవిట్లో నాని ఎందుకు రాయలేదని ప్రశ్నించారు. కేశినేని నాని పశ్చిమ నియోజకవర్గంలో పర్యటించి సుజనా చౌదరి, చంద్రబాబుపై నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుంచుతామని సుజనా చెప్పారని, అది అర్థం చేసుకోకుండా నాని నోటి కొచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆయనకు కుటుంబ సభ్యులే మద్దతు ఇవ్వడం లేదన్నారు.
అప్పులు తీసుకుని ఎగ్గొట్టే చరిత్ర నానీదని, ఆయన చీటర్ కాబట్టే చంద్రబాబు మెడపట్టి బయటకు గెంటేశారని అన్నారు. చీటింగ్ కేసులు ఉన్న నాని పోటీకి అనర్హుడని, పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల కష్టంతో కేశినేని నాని ఎంపీ అయ్యాడని ఆరోపించారు. ఏ నాడూ పేదలకు సొంత డబ్బు సాయం చేయలేదన్నారు. నిజాయితీ ఉంటే అప్పులు చెల్లించి రావాలని డిమాండ్ చేశారు.