2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మధ్యంతర బడ్జెట్ (Interim Budget)ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sita Raman) గురువారం ప్రవేశ పెట్టనున్నారు. ఇప్పుడు దేశ ప్రజలందరి దృష్టి మధ్యంతర బడ్జెట్ పైనే ఉంది. లోక్ సభ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రజలపై కేంద్రం వరాల జల్లు కురిపిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పీఎం కిసాన్, ఆయుష్మాన్ భారత్ లాంటి పథకాలు, పన్నులు, చమురు, వంట గ్యాస్ ధరల తగ్గింపు వంటి అంశాల గురించి ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ మధ్యంతర బడ్జెట్‌తో రైతులను ఆకట్టుకునేందుకు కేంద్రం ప్రయత్నం చేసే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. పీఎం కిసాన్ యోజన కింద రైతులకు ఏటా రూ.6000 అందిస్తున్నారు. కానీ ఈ సారి ఆ మొత్తాన్ని 9000కు పెంచి అందించాలనే యోచనలో మోడీ సర్కార్ ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గతేడాది ఈ పథకం కోసం రూ. 60వేల కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ ఏడాది ఈ పథకానికి 50 శాతం నిధులు అదనంగా కేటాయిస్తారని తెలుస్తోంది.
త్వరలో లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు ప్రజలను ఆకట్టుకునేలా పలు ప్రకటనలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై ఈ బడ్జెట్‌లో ప్రకటన ఉంటుందని వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. అదే సమయంలో వంట గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించే అవకాశం ఉందని లేదా సబ్సిడీలను పెంచి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేయవచ్చంటున్నారు.
ఈ బడ్జెట్‌లో నేషనల్ పెన్షన్ స్కీమ్‌ను కేంద్రం బలోపేతం చేస్తుందని తెలుస్తోంది. ముఖ్యంగా అధిక పన్ను రాయితీలు, విత్ డ్రా లిమిట్ పెంచడం లాంటివి ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇవే జరిగితే పెన్షనర్లకు, బ్యాంకు ఖాతాదారులకు మంచి లబ్ధి చేకూరుతుంది. అయితే ఇది 75 ఏండ్ల వయస్సు పైబడిన వారికి మాత్రమే వర్తింప చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక ఈ బడ్జెట్‌లో ఎలాంటి కొత్త పన్ను విధింపులు ఉండబోవని తెలుస్తోంది. ఆదాయపన్ను చట్టంలో 1961 సెక్షన్ 80డీ కింద ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులపై, వైద్య ఖర్చులపై ట్యాక్స్ డిడక్షన్ చేసుకునే అవకాశం ఉంది. తాజాగా ఈ మధ్యంతర బడ్జెట్లో సెక్షన్ 80డీ కింద చేసుకునే హెల్త్ క్లెయిమ్ పరిమితిని పెంచే అవకాశాలు ఉన్నాయని ఆర్థికనిపుణులు చెబుతున్నారు. దీంతో అదపన్న పను లాభాలను కల్పించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇక ఇంటి పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు కోసం సూర్యోదయ పథకాన్ని కేంద్రం తీసుకు వచ్చింది. దీనిలో భాగంగా కోటి ఇళ్లకు రూఫ్‌టాప్ సోలార్ ప్యానల్స్ కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే దీని కోసం సబ్సిడీలు అందించి సోలార్ ప్యానెల్ ఇన్ స్టాలేషన్ ప్రక్రియను కేంద్రం ప్రోత్సహిస్తోంది. ఈ పథకంలో భాగంగా 10 కిలోవాట్ కెపాసిటీ ఉన్న సిస్టమ్‌లకు ఫేజ్-2 కింద కిలోవాట్‌కు రూ.9 వేలు నుంచి రూ.18 వేలు వరకు కేంద్రం సబ్సిడీ రూపంలో అందిస్తోంది. 10 కిలోవాట్ల కంటే ఎక్కువ ఉన్న సిస్టమ్‌లకు రూ.1,17,000 వరకు ఫిక్స్డ్ సబ్సిడీ అందిస్తోంది. తాజాగా ఈ బడ్జెట్‌లో ఈ సబ్సిడీ మొత్తాన్ని భారీగా పెంచే అవకాశం ఉంది.