బడ్జెట్ (Budget) ప్రసంగంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sita Raman) కీలక వ్యాఖ్యలు చేశారు. 2014కు ముందు దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది… ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థ ఎలా శక్తివంతంగా మారిందనే విషయంపై శ్వేత పత్రాన్ని సభ ముందు ఉంచుతామని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశం హోదా వైపు భారత్ ఎలా ముందడుగు వేస్తుందో ఈ పదేండ్ల పాలన చూస్తే అర్థమవుతుందని చెప్పారు.
సుపరిపాలన వల్ల దేశ ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి మార్పులు వస్తాయనే దానికి మోడీ సర్కార్ పాలనే నిదర్శనమని చెప్పారు. పదేండ్ల బీజేపీ పాలనలో ప్రతక్ష పన్నుల చెల్లింపుదారుల సంఖ్య మూడు రెట్లు పెరిగిందన్నారు. పన్ను రేట్ల విధానంలో హేతుబద్ధతను అనుసరిస్తూ పన్ను చెల్లింపుదారులపై భారం చాలా తగ్గించామని అన్నారు. పన్ను చెల్లింపుదారుల ప్రతి రూపాయిని దేశాభివృద్ధికి ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఫేస్‌లెస్ విధానంతో పన్ను అసెస్‌మెంట్‌లో పారదర్శకతను తీసుకు వచ్చామన్నారు. సత్వర రిటర్న్‌ల చెల్లింపులకు అవకాశం కల్పించామని వెల్లడించారు. జీఎస్టీ విధానం తీసుకు రావడంతో పన్ను పరిధి రెట్టింపయిందన్నారు. సరాసరి నెలవారీ జీఎస్టీ ఆదాయం రూ.1.66 కోట్లకు చేరిందని చెప్పుకొచ్చారు. జైవిజ్ఞాన్, జైకిసాన్, జైఅనుసంధాన్ అనేది తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు.
‘సమీకృత సాంకేతిక అభివృద్ధి దిశగా రక్షణ రంగానికి ఊతమిస్తున్నాం. మార్కెట్ వ్వవస్థతతో నూతన పరిజ్ఞానాన్ని అనుసంధానిస్తే వ్యవసాయరంగాలకు కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించామని, వృథాను అరికట్టి రైతులకు అధిక ఆదాయం సమకూర్చే పథకాలను అమలు చేశాం’అని అన్నారు.
‘వ్యవసాయ ఉత్పత్తుల కోసం గిడ్డంగులు, ప్రాసెసింగ్ కోసం ఆర్థిక సాయం అందిస్తున్నాం. నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు కొత్త పథకం తీసుకు వస్తున్నాం. పాడి అభివృద్ధి కోసం రైతులకు ఆర్థికసాయం చేస్తాం. రాష్ట్రీయ డెయిరీ ప్రాసెసింగ్, గోకుల్ మిషన్ ద్వారా డెయిరీ ప్రాసెసింగ్‌కు ఆర్థిక సాయం అందిస్తున్నాం. 83 లక్షల ఎస్‌ఎస్‌జీల ద్వారా 9 కోట్లమంది మహిళలు ఆర్థికంగా ఉన్నతి సాధించారు. కోటిమంది లక్షాధికారులుగా తయారయ్యారు. 2 కోట్ల నుంచి 3 కోట్లమంది మహిళలు లక్షాధికారులు కావాలన్నదే లక్ష్యం’అని వివరించారు.