ఆపదలో సమయస్పూర్తిగా వ్యవహరించడం అందరికీ సాధ్యం కాదు. కాగా సమయస్పూర్తి కొందరికి అనుభవంతో వస్తుంది. అదే ఆపదలో కాపాడుతోంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే హైదరాబాద్ (Hyderabad)లోని బంజారాహిల్స్ (Banjara Hills)లో చోటుచేసుకుంది.
కోఠి (Koti) నుంచి పటాన్‌చెరు (Patancheru) వెళ్తున్న బస్సు బంజారాహిల్స్‌లోని కేబీఆర్ (KBR) పార్కు వద్దకు రాగానే ఒక్కసారిగా బ్రేక్ ఫెయిల్ అయింది. అసలే ఈ రూట్ లో భారీగా ట్రాఫిక్ ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించిన ప్రమాద తీవ్రత ఊహించని స్థాయిలో ఉంటుంది. ఇక్కడే ఆ బస్సు డ్రైవర్ వెంకటేష్ తన అనుభవాన్ని ఉపయోగించి బస్సు వేగాన్ని అదుపులోకి తెచ్చారు.
డ్రైవర్ వెంకటేష్ బస్సు హ్యాండ్ బ్రేక్ వేసి కొంతమేర అదుపు చేసినా ఇంకా బస్సు రన్నింగ్ లో ఉంది. దీంతో వెంటనే బస్సును పార్కు వైపు తిప్పాడు. దాదాపు ఫుట్‌పాత్‌పైకి వచ్చిన బస్సు.. అక్కడే ఆగింది. కాగా ఆ సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉండగా.. వారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మరోవైపు బస్సును అదుపు చేసే క్రమంలో ఎదురుగా ఉన్న కారును స్వల్పంగా ఢీకొట్టింది బస్సు.. ఏదైతే నేమి మొత్తానికి ప్రాణ నష్టం జరగకుండా చేసిన డ్రైవర్ వెంకటేష్ నిజమైన హీరో అంటూ ప్రయాణికులు పొగిడారు..