అతివేగం ప్రాణాలకు ప్రమాదకరం అని కనిపించే బోర్డులు కేవలం చదువుకోవడానికి మాత్రమే పనికి వచ్చేలా ఉంటున్నాయి.. ఎందుకంటే వేగం వల్ల ప్రాణాలకి ప్రమాదం ఉందని తెలిసిన ఎవ్వరూ తగ్గడం లేదని జరుగుతోన్న ప్రమాదాలు నిరూపిస్తున్నాయి. మరోవైపు ఆర్టీసీ ప్రయాణం సురక్షితం అని చెబుతోన్న అధికారులు.. బస్సులు నడిపే డ్రైవర్ల మానసిక స్థితిపై కాస్త దృష్టి పెడితే బస్సు ప్రమాదాలు తగ్గవచ్చని కొందరి అభిప్రాయం.
ఈ మధ్యకాలంలో లారీలు నడిపేవారు ఎక్కువగా ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.. ఇలాంటి వారికి దూకుడు స్వభావం ఉండటం సహజమే.. అందువల్ల కాస్త వేగంగా బస్సులు నడుపుతూ ప్రమాదాలకు కారణం అవుతోన్నారని విమర్శలు లేకపోలేదు.. ఇకపోతే వరంగల్ (Warangal) సమీపంలో RTC బస్సుకు పెను ప్రమాదం తప్పింది.. అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు..
హనుమకొండ (Hanumakonda) జిల్లా దామెర (Damera) మండలం ఒగ్లాపూర్ (Oglapur) మీదుగా అతివేగంగా వెళ్తున్న RTC బస్సు అదుపతప్పి రోడ్డు పక్కన ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లింది.. ఈ బస్సు వరంగల్- 2 డిపో కు చెందినదిగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో 20 మందికి పైగా స్వల్పంగా గాయపడ్డట్టు తెలుస్తోంది. కాగా ప్రమాద సమయంలో బస్సులో 45 మంది కి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.. కాగా గాయపడ్డ వారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు
డ్రైవర్ అజాగ్రత్త వల్ల ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అతి వేగంగా వెళ్తున్న బస్సు ఒగ్లపూర్ వద్ద ముందున్న వాహనాన్ని ఓవర్ టెక్ చేసేందుకు ప్రయత్నించింది.. ఈ క్రమంలోనే డ్రైవర్ బస్సును కంట్రోల్ చేయలేక పోవడంతో, అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పత్తి పొలాల్లోకి దూసుకెళ్లినట్టు స్థానికుల సమాచారం.. మరోవైపు ప్రమాదం గురించి తెలుసుకొన్న RTC అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నట్టు తెలుస్తుంది.