విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్(Vijayawada bus stop)లో బస్సు బీభత్సం సృష్టించిన విషయం విధితమే. ప్లాట్‌ఫాంపై బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం(Accident)లో ముగ్గురు ప్రయాణికులు బస్సు టైర్ల కింద పడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అయితే ఈ ప్రమాద ఘటనపై ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం ఓ కమిటీని వేయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ ఘటనపై ప్రభుత్వం ముగ్గురు సభ్యుల కమిటీని వేసింది. మానవ తప్పిదమే ప్రమాదానికి కారణమని కమిటీ నిర్ధారించింది. బస్ ఫిట్‌నెస్ బాగానే ఉందని టెక్నికల్ టీమ్ తెలిపారు. అయితే డ్రైవర్ రివర్స్ గేర్ బదులుగా ఫ్రంట్ గేర్ వేసినట్లు తేల్చింది. డ్రైవర్ ప్రకాశం వయసు 62 ఏళ్లు కాగా, అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవలే విధుల్లో చేరినట్టు ఆర్టీసీ ఎండీ తిరుమలరావు వెల్లడించారు.
విజయవాడ నుంచి గుంటూరు వెళ్లాల్సిన ఏసీ సర్వీసు బస్సు విజయవాడ ఆటోనగర్ డిపో నుంచి నెహ్రూ బస్టాండ్‌లోకి వచ్చింది. ఉన్నట్టుండి ప్లాట్‌ఫాం పైకి బస్సు అతివేగంగా దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో బస్సు చక్రాల కింద పడి ముగ్గురు బలయ్యారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. గాయపడిన వారి ఆసుపత్రి ఖర్చు ఆర్టీసీ భరిస్తుందని ఆర్టీసీ ఎండీ చెప్పారు. ఈ ప్రమాద ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందిస్తూ.. వైసీపీ ప్రభుత్వం ఒక్క కొత్త బస్సును కొనుగోలు చేయలేదని, కాలంచెల్లిన బస్సుల కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించిన సంగతి తెలిసిందే.