వ్యాపారంలో భాగస్వాముల లెక్కల వ్యవహారం కాస్త రచ్చకెక్కింది. ఓ భాగస్వామి మిల్లుకు సంబంధించి లెక్కలడిగిన పాపానికి అతడి ఇంట్లో చొరబడి దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా అర్ధనగ్నంగా ఊరేగించారు. ఈ అమానుష ఘటన చేర్యాల పోలీస్ స్టేషన్(Cheryala Police Station) పరిధిలో చోటు చేసుకుంది.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నేతి నవత మరో ఎనిమిది మంది కలిసి దుల్మిట్ల గ్రామంలో రెండు సంవత్సరాలుగా శ్రీ పరమేశ్వర రైస్ ఇండస్ట్రీస్ అనే రైస్ మిల్లు(Rice mill)ను నిర్వహిస్తున్నారు. నేతి నవత భర్త శశికాంత్ హైదరాబాద్‌లో ఉండటంతో మిల్లుకు సంబంధించిన లావాదేవీలు శశికాంత్ తండ్రి నేతి నారాయణ అడిగితే బెజుగాం కొండయ్య ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఎన్ని సార్లు అడిగినా దాటవేస్తున్నారు.
ఇదే విషయంలో మరో భాగస్వామి దుబ్బుడు సుధాకర్ 2024 జనవరి 30న చేయిచేసుకున్నాడు. లెక్కలు అడిగిన విషయం మనసులో పెట్టుకొని 2024 ఫిబ్రవరి 8న ఎలసాని సుధాకర్, ఎలసాని భాస్కర్, ఎలసాని నాగరాజు, మరియాల ప్రవీణ్, మరియాల సత్తయ్య, మరియాల చంద్రయ్య, మరికొందరు నేతి నారాయణ ఇంట్లోకి చొరబడి మూకుమ్మడికి దాడికి పాల్పడ్డారు.
నారాయణను రోడ్డుమీదకు లాక్కొని వచ్చి అర్ధనగ్నంగా పట్టణంలో తిప్పతూ దాడికి దిగారు. అడ్డుపడిన నేతి చంద్రకళ, భవానిని నెట్టివేసి, చంపేస్తామని బెదిరించారు. దీంతో బాధిత కుటుంబం చేర్యాల పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లగా నిందితులను వెంటనే అరెస్టు చేయాలని అదేశించినట్లు సమాచారం.