తెలంగాణ కేబినెట్ సమావేశం (Cabinet Meeting) జరుగుతోంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఆరు గ్యారెంటీల అమలు, బడ్జెట్ సమావేశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. దీంతో పాటు పలు శాఖలు అందించిన ప్రతిపాదనలపై సీఎం, డిప్యూటీ సీఎం ఇతర మంత్రులు సమీక్షలు నిర్వహించారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీల ఖరారుపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఈ సారి పూర్తి స్థాయి బడ్జెట్ కు బదులుగా మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెట్టాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలు, గవర్నర్ ప్రసంగం గురించి కేబినెట్ సమావేశం చర్చిస్తున్నారు.
కుల గణనపై కూడా సమావేశంలో చర్చిస్తున్నారు. ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లపై ఈ సమావేశంలో చర్చ జరుగుతోంది. గ్రూప్-1 పరీక్షపై కేబినెట్ చర్చిస్తోంది. గ్రూప్-1 లో 160 అదనపు పోస్టులను కలపడంపై ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. మరోవైపు రెండు కొత్త పథకాలపై మంత్రులతో రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత్ విద్యుత్ పథకాలను త్వరలోనే అమలు చేయనున్నట్లు ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రకటించారు.
అంతకు ముందు మీడియా సమావేశంలో కృష్ణా నది జలాల వివాదంపై రేవంత్ రెడ్డి మాట్లాడారు. జల దోపిడికి కేసీఆర్ కారణమని అన్నారు. నీటి ప్రాజెక్టులపై శ్వేత పత్రం విడుదల చేస్తామని అన్నారు. దమ్ముంటే కేసీఆర్ చర్చకు రావాలని సవాల్ కూడా విసిరారు. ఈ నేపథ్యంలో శ్వేత పత్రం విడుదలపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టు సమాచారం.