Telugu News » Canada : కెనడాకి విమాన ప్రయాణమా…! ఆస్తులు అమ్ముకోవాల్సిందే !

Canada : కెనడాకి విమాన ప్రయాణమా…! ఆస్తులు అమ్ముకోవాల్సిందే !

సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి కెనడాకు వెళ్లేందుకు ఒకవైపు టికెట్ ధర రూ.55 వేల నుంచి 65 వేల మధ్య ఉంటుంది. విద్యా సంవత్సరం ప్రారంభ సమయంలో ఆ ధర రూ. లక్ష నుంచి రూ. 1.10 లక్షల వరకు పలుకుతుంది.

by Prasanna
canada

ప్రస్తుతం కెనడా (Canada) కి విమాన ప్రయాణం చేయాలంటే టిక్కెట్ కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిందే అంటున్నారు ఎయిర్ ప్యాసింజర్లు (Air Passangers). కెనడాలోని ఏ సిటీకి వెళ్లాలన్నా కూడా  టికెట్ (Flight Tickets) ధరలు గతంతో పోల్చుకుంటే వంద శాతం కంటే ఎక్కువగా పెరిగాయి. గత కొంత కాలంగా భారత్, కెనడా దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల ప్రభావం విమాన టిక్కెట్లపై కనిపిస్తోంది. కెనడాలో ఇప్పుడు కాలేజీలు, స్కూల్స్ ప్రారంభమయ్యే సీజన్. దీంతో భారత్ నుంచి కెనడా వెళ్లేవారు విమాన టిక్కెట్లు కొనుగోలు చేస్తుంటారు. ధరలు పెరగడానికి ఇదొక కారణంగా కూడా ఎయిర్ ట్రావెల్ ఏజెంట్లు చెప్తున్నారు.

canada

సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి కెనడాకు వెళ్లేందుకు ఒకవైపు టికెట్ ధర రూ.55 వేల నుంచి 65 వేల మధ్య ఉంటుంది. విద్యా సంవత్సరం ప్రారంభ సమయంలో ఆ ధర రూ. లక్ష నుంచి రూ. 1.10 లక్షల వరకు పలుకుతుంది. సెప్టెంబరు రెండో వారం నుంచి టికెట్ ధరలు దాదాపుగా సాధారణ పరిస్థితికి వస్తాయి. కానీ సెప్టెంబర్ చివరి వారానికి చేరుకున్నా కూడా ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడు కెనడాకి వెళ్లాలంటే కనీసం రూ. 1.4 లక్షలు నుంచి రూ. 1.6 లక్షల వరకు ధర పలుకుతోంది. ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఉందని ట్రావెల్ ఏజెంట్లు చెప్తున్నారు.

ప్రతి విద్యా సీజన్లో తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు కెనడాలో ఉన్నత విద్యను చదివేందుకు వెళుతుంటారు. ఆ దేశంలోని టొరంటో, మాంట్రియల్, ఒట్టావా నగరాలకు విద్యార్థులు ఎక్కువగా వెళతారు. వాణిజ్యం పరంగా రెండు దేశాల మధ్య రాకపోకలు భారీగానే ఉంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఫార్మాస్యూటికల్, మిషనరీ, ముత్యాలు, ఆభరణాల వ్యాపారులు కెనడాకు రాకపోకలు సాగిస్తుంటారు.

సాధారణంగా విద్యాసంవత్సరం ప్రారంభంలోనే టికెట్ ధరలు ఎక్కువగా ఉంటాయని, తర్వాత పరిస్థితి మామూలైపోతుందని, కానీ ఈ సారి ధరలు భారీగా పెరుగుతున్నాయని ట్రావెల్ ఏజెన్సీలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య పరిస్థితుల నేపథ్యంలో టికెట్లకు డిమాండ్ పెరగడంతోనే ఇంతలా ధరలు పెరిగాయని అంటున్నారు.

 

You may also like

Leave a Comment