కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై నమోదు చేసిన కేసును అసోం పోలీసులు సీఐడీ (CID)కి బదిలీ చేశారు. ఈ వ్యవహారంలో సమగ్ర దర్యాప్తు కోసం కేసును సీఐడీకి బదిలీ చేస్తున్న రాష్ట్ర డీజీపీ (DGP) జీపీ సింగ్ (GP Singh) వెల్లడించారు. ఈ మేరకు విషయాన్ని ఆయన ఎక్స్ (ట్విట్టర్)లో వెల్లడించారు.
రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ను గౌహతిలోని ప్రధాన మార్గాల గుండా వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో పోలీసులతో కాంగ్రెస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని నగరంలో యాత్రకు ప్రభుత్వం నిరాకరించింది. నగరం గుండా కాకుండా బైపాస్ నుంచి వెళ్లాలని సూచనలు చేసింది.
ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో నగరంలోకి యాత్రను అనుమతించబోమని చెప్పారు. ఈ మేరకు బారికేడ్లను అడ్డు పెట్టారు. కానీ బారికేడ్లను తోసుకుంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ముందుకు దూసుకు వెళ్లారు. దీంతో పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో కొంత మంది పోలీసులపై దాడులు చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది.
ఘటన నేపథ్యంలో రాహుల్ గాంధీపై కేసులు నమోదు చేయాలని పోలీసులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. యాత్ర పేరిట అసోంలో శాంతి భద్రతలకు కాంగ్రెస్ విఘాతం కలిగించాలనుకుంటోందని సీఎం హిమంత బిస్వ శర్మ వెల్లడించారు. హింసాత్మక ఘటనలు, పోలీసు సిబ్బందిపై దాడి నేపథ్యంలో రాహుల్ గాంధీతో పాటు పలువురు నేతలపై కేసులు నమోదు చేశామన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు.