శ్రీశాంత్ (Sreesanth) టీమిండియా (India) క్రికెట్ (Cricket)లోకి ఎంతో వేగంగా దూసుకొచ్చిన స్టార్ పేసర్.. తన బౌలింగ్ తోనే కాకుండా యాటిట్యూడ్ తో వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. శ్రీశాంత్ కెరీర్ సాఫీగా సాగిపోతున్న టైమ్ లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొని క్రికెట్ నుంచి నిషేధానికి గురైయ్యాడు. అంతటితో ఆగిపోని శ్రీశాంత్ ఎప్పుడూ వివాదాలతో దోస్తీ కడతాడని పేరుకూడా తెచ్చుకున్నాడు.
ఆటను వదిలిన తర్వాత శ్రీశాంత్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు.. అలా సకల కళా వల్లభుడైన టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ పై తాజాగా చీటింగ్ కేసు నమోదు అయ్యింది. కేరళలోని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు, శ్రీశాంత్ తో పాటుగా మరో ఇద్దరిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. కర్ణాటక రాష్ట్రం కొల్లూరులో క్రికెట్ అకాడమీ నిర్మిస్తామని చెప్పి, 2019లో శ్రీశాంత్ తో పాటుగా రాజీవ్ కుమార్, వెంకటేష్ అనే వ్యక్తులు తన వద్ద విడతల వారీగా రూ. 18.70 లక్షలు తీసుకున్నారని చుండా ప్రాంతానికి చెందిన సరీష్ గోపాలన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఈ క్రమంలో స్పోర్ట్స్ అకాడమీలో భాగస్వామి అవుతావని మాయమాటలు చెప్పి తనతో పెట్టుబడి పెట్టిచ్చినట్టు బాధితుడు వెల్లడించారు.. ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలైన అకాడమీ నిర్మాణం జరగడం లేదు.. డబ్బులు అడిగినా మాట తప్పిస్తున్నారని బాధితుడు ఆవేదన చెందుతున్నాడు.. ఈ నేపథ్యంలో తాను పోలీసులను ఆశ్రయించినట్టు సరీష్ గోపాలన్ వెల్లడించారు..
కాగా బాధితుడు ఫిర్యాదు మేరకు శ్రీశాంత్ తో పాటుగా మరో ఇద్దరిపై ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ కేసులో శ్రీశాంత్ ను ఏ3గా చేర్చినట్లు వారు పేర్కొన్నారు. మరోవైపు 40 ఏళ్ల పేస్ బౌలర్ శ్రీశాంత్.. 2013 ఐపీఎల్లో ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఇక తన కెరీర్లో శ్రీశాంత్ 27 టెస్టు, 53 వన్డే, 10 టీ20 మ్యాచ్లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి అతడు 169 వికెట్లు పడగొట్టాడు.