ప్రపంచ కప్ (World Cup) గెలుచుకున్న తర్వాత ఆసీస్ క్రికెటర్లు సంబురాల్లో మునిగి తేలారు. డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రపంచ కప్ పట్టుకుని ఫోటోలు దిగారు. ఈ క్రమంలో ‘ప్రపంచ కప్’పై కాళ్లు పెట్టి ఆసిస్ ప్లేయర్ మిచెల్ మార్ష్ (Mitchell Marsh) ఫోటోలకు ఫోజు ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో మిచెల్ మార్షల్ తీరుపై నెటిజన్లు, క్రీడాభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకు పడుడుతున్నారు.
వరల్డ్ కప్‌ను ఎలా గౌరవించాలనే విషయం మార్ష్ కు తెలియదంటూ మండిపడుతున్నారు. భారత ఆటగాళ్లను చూసి ఆ విషయాన్ని నేర్చుకోవాలని సూచిస్తున్నారు ఇది ఇలా వుంటే ఈ ఘటనకు సంబంధించి మిచెల్ మార్ష్‌పై కేసు నమోదైంది. వరల్డ్‌కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అలీగఢ్ కు చెందిన పండిట్ కేశవ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వరల్డ్ కప్ పై కాళ్లు పెట్టి భారతీయుల మనోభావాలను దెబ్బ తీశాడని ఆయన ఆరోపించారు. ఇది భారతీయులకు అవమానం కలిగించే చర్యగా ఆయన అభివర్ణించారు. ఆ ఫిర్యాదును స్వీకరించిన ఢిల్లీ గేట్ పోలీసులు మార్ష్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం ఆ ఫిర్యాదు కాపీని ప్రధాని మోడీతో పాటు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కు కూడా పంపించారు.
మిచెల్ మార్ష్ పై చర్యలు తీసుకోవాలని ప్రధానితో పాటు కేంద్ర మంత్రిని కోరారు. భారత్‌లో ఎలాంటి క్రికెట్ మ్యాచ్‌లు ఆడకుండా, విదేశాల్లోనూ టీమ్ఇండియాతో ఆడకుండా మిచెల్ మార్ష్ పై జీవిత కాలం పాటు నిషేధించాలని డిమాండ్ చేశారు. ఇది ఇలా వుంటే మిచెల్ మార్ష్ ఫొటోను చూసి తాను చాలా హర్ట్ అయ్యానని షమీ అన్నారు. ఆ ట్రోఫీ కోసం ప్రపంచంలోని టీమ్‌లు అన్నీ పోటీపడతాయన్నారు. అందుకే దాన్ని ఎల్లప్పుడూ తల కంటే ఎత్తులో ఉంచాలన్నారు.