ప్రగతి భవన్.. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు జ్యోతిబా పూలే ప్రజా భవన్ (Praja Bhavan). గతంలో వైఎస్ మాదిరిగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) కూడా ఇప్పుడు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఎవరికేం సమస్యలు ఉన్నాయో చెప్పాలని ప్రజా భవన్ తలుపులు తెరిచారు. అడ్డుగా ఉన్న ఇనుప కంచెలను తొలగించారు. అయితే.. ప్రజా దర్బార్ (Praja Darbar) మొదటి రోజు జనం తండోపతండాలుగా తరలివచ్చారు. తమ సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. ఇదే క్రమంలో ఓ వ్యక్తి శిలాఫలకంపై ఉన్న మాజీ సీఎం కేసీఆర్ (KCR) పేరుపై బురద రాసిన వీడియో చక్కర్లు కొట్టింది. ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించారు.
కేసీఆర్ పేరుకు మట్టి పూసిన ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు. ఈ పని చేసిన కాంగ్రెస్ (Congress) యూత్ లీడర్ రాకేష్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. రాకేష్ మట్టి రాస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గులాబీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం పాటుపడిన వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ మండిపడ్డారు.
బీఆర్ఎస్ నేత క్రిశాంక్ స్పందిస్తూ.. అతను కాంగ్రెస్ నాయకుడని కేసీఆర్ పేరుపై బురద రాశాడని, మెడలో కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకున్న అతని ఫొటోను షేర్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంతో కృషి చేసిన గొప్ప నాయకుడి పట్ల ఇలాగేనా వ్యహరించేది అని ప్రశ్నించారు. “కేసీఆర్ పేరును బురదతో కొట్టి తెలంగాణ చరిత్ర నుండి ఆయన పేరును తుడిచివేయలేం. కాంగ్రెస్ ప్రభుత్వం అలా చేయాలని భావిస్తే కేసీఆర్ హయాంలో నిర్మించిన ప్రతి కలెక్టర్ ఆఫీసు, ప్రతి కమిషనరేట్, ప్రతి పాఠశాల, హాస్పిటల్, లైబ్రరీ పట్ల ఇలాగే వ్యవహరిస్తారా?’’ అని పోస్ట్ చేశారు క్రిశాంక్.
ఇతర గులాబీ నేతలు, కార్యకర్తలు కూడా దీనిపై అభ్యంతరం తెలిపారు. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. మట్టి రాసిన వ్యక్తి కాంగ్రెస్ కు చెందిన రాకేష్ రెడ్డిగా గుర్తించారు. ఈ నేపథ్యంలో అతనిపై కేసు బుక్ చేశారు.