ఎన్నికల నోటిఫికేషన్ (Election Notification) రాగానే ప్రలోభాల పర్వం మొదలైంది. ఎన్నికల కోడ్ (Election Code) అమలులోకి వచ్చిన మూడు రోజుల్లోనే భారీగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్ కమిషన రేట్ పరిధిలో సోదాలు నిర్వహించి రూ.5.1 కోట్ల నగదు, రూ.42 కోట్లు విలువైన బంగారాన్ని సీజ్ చేసినట్టు సీపీ వెల్లడించారు. కూకట్ పల్లిలో ఓ బంగారు వ్యాపారి నుంచి రూ. 2కోట్లు విలువైన బంగారం, వజ్రాలను ఎస్‌ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇక రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌లో రసీదులు లేకుండా బంగారు తీసుకు వెళ్తుండగా పోలీసులు గుర్తించి బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.30 లక్షల విలువైన 50 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఇక సూర్యా పేటలోని చిలకలూరులో నిర్వహించిన తనిఖీల్లో రూ.45లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. తమ్మర ప్రాంతంలో కారు డ్రైవర్ నుంచి రూ.7.30 లక్షలను సీజ్ చేశారు.
సంగారెడ్డి పటాన్ చెరులో వెహికల్ చెకింగ్ నిర్వహించిన పోలీసులు రూ. 7 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. మహబూబ్ నగర్ తొర్రూరులో బస్సులో ఓ ప్రయాణికుని దగ్గర నుంచి రూ.8 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇక కామారెడ్డి జిల్లాలో రూ.2.40 లక్షల నగదు, యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు చెక్‌పోస్టు వద్ద ఓ వ్యక్తి నుంచి రూ.4 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఎన్నికలపై ఉన్నతాధికారులతో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఉన్నాతాధికారుల సమీక్ష నిర్వహించారు. అక్రమ నగదు, మద్యం, మాదక ద్రవ్యాలపై కఠినంగా వ్యవహరించాలని దిశా నిర్దేశం చేశారు. ప్రచార సమయంలో పలు రాజకీయ పార్టీలు ఒకే దగ్గర ఎదురు పడితే ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉండటంతో అలా జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆయుధాలకు నూతన లెసెన్లు జారీ చేయకూడదని సీపీ సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీసు యంత్రాంగం విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. సోదాల్లో భారీగా స్వాధీనం చేసుకుంటున్నట్టు వెల్లడించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన సోదాల్లో రూ.5.1 కోట్ల నగదు, రూ.42 కోట్లు విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నట్లు సీవీ ఆనంద్ పేర్కొన్నారు.