Telugu News » CBN Squash petition : చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ… తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం…!

CBN Squash petition : చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ… తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం…!

ఈ కేసులో 17ఏ సెక్షన్ వర్తించదని సీఐడీ తరఫున ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు.

by Ramu
cbn quash petition arguments in supreme court arguments on 17a continued in the supreme court supreme court bench reserved judgment

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టు (Supreme Court) లో ఈ రోజు విచారణ జరిగింది. ఈ స్పెషల్ లీవ్ పిటిషన్‌పై జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం. త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసులో 17ఏ సెక్షన్ వర్తించదని సీఐడీ తరఫున ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు.

cbn quash petition arguments in supreme court arguments on 17a continued in the supreme court supreme court bench reserved judgment

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఉన్న అభియోగాలన్నీ ప్రత్యేక న్యాయస్థానం ద్వారా విచారించదగినవేనన్నారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసిన సందర్బంలో కూడా వాటిపై ఐపీసీ సెక్షన్ల ప్రకారం కూడా విచారణ చేపట్టే అధికారం ప్రత్యేక న్యాయస్థానాలకు ఉంటుందన్నారు. అవినీతి కేసులపై విచారణ జరిపేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారన్నారు.

17 ఏ సెక్షన్‌ అనేది కేవలం అధికారిక నిర్ణయాల సిఫార్సులకు మాత్రమే వర్తిస్తుందని ఆయన వాదించారు. పాత నేరాలకు సంబంధించి ఈ సెక్షన్‌ వర్తించదని రోహిత్గి అన్నారు. కేవలం ప్రజా ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకునే వాళ్లకు ఇబ్బంది ఏర్పడకూడదనే ఉద్దేశంతోనే ఈ చట్టాన్ని తీసుకు వచ్చారని తెలిపారు. అంతే కానీ ఈ చట్టం అవినీతిపరులకు రక్షణ ఛత్రం కాకూడదన్నారు.

దీనిపై స్పందించిన ధర్మాసనం మాట్లాడుతూ…. ఓ వ్యక్తిపై ఆరోపణలు ఉన్నప్పుడు ఛార్జిషీట్లు దాఖలు చేసి విచారణ జరిపి వారికి శిక్షలు కూడా విధించ వచ్చన్నారు. కేవలం ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని అన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతామా..? అని ప్రశ్నించారు. అవి అవినీతి కేసుల కిందకు వస్తుందంటే వాటిని పరిగణించండన్నారు. లేని పక్షంలో వాటిని కొట్టి వేయాలన్నారు.

అవినీతి కేసుల్లో ప్రాథమిక ఆధారాలు వున్నాయని రోహిత్గి అన్నారు. అలాంటి సందర్బంలో ఆ కేసులను విచారించే న్యాయ పరిధి ప్రత్యేక కోర్టుకు ఉంటుందన్నారు. ఈ కేసులో జీఎస్టీతో పాటు ఆదాయ పన్ను, ఇతర విభాగాలు దర్యాప్తు చేశాయన్నారు. అనంతరం చంద్రబాబు తరఫున న్యాయవాది హరీష్‌ సాల్వే వాదనలు వినిపించారు. ఎన్నికల ముందు రాజకీయాల్లో కక్షసాధింపులకు అవకాశం ఉంటుందన్నారు. అలాంటి సందర్బాల్లో రాజకీయ కక్ష సాధింపులకు అడ్డుకునేందుకే 17ఏ చట్టం ఉందని తెలిపారు. 17ఏ లేకపోతే రాజకీయంగా వేధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు.

ఈ కేసులో ఆధారాల సేకరణను సరైన పద్దతిలో నిర్వహిస్తారా అనే విషయంపై కూడా తమకు నమ్మకం లేదన్నారు. ఇప్పటి వరకు రిమాండ్‌ రిపోర్టు, కౌంటర్‌ అఫిడవిట్లు అన్నింటిలో కేవలం ఆరోపణలే కనిపిస్తున్నాయన్నారు. ఈ కేసులో మొదట్లో చంద్రబాబు పేరును ఎప్ఐఆర్ లో ప్రస్తావించలేదన్నారు. కేవలం రిమాండ్ సమయంలో చంద్రబాబు పేరును చేర్చారని అన్నారు.

ఎలాంటి పరిస్థితులోనైనా 17ఏ చట్టం వర్తిస్తుందన్నారు. 2016-17లో విచారణ జరిపారని, అప్పుడు ఏమీ తేలలేదన్నారు. 2021లో మళ్లీ విచారణ మొదలు పెట్టారన్నారు. ఆధారాల కోసం వెతుకుతున్నారన్నారు. చంద్రబాబు వయస్సు 73 ఏండ్లు అని, 40 రోజులుగా ఆయన జైలులో ఉన్నారని గుర్తు చేశారు. అందువల్ల చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని సాల్వే కోరారు. కోర్టు సెలవుల దృష్ట్యా మధ్యంతర బెయిల్‌ అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కేసు విచారణను, తీర్పును ధర్మాసనం రిజర్వ్‌ చేసింది.

You may also like

Leave a Comment