వైసీపీ ప్రభుత్వం చీకటి వ్యాపారాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిచిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Nayudu)ఆరోపించారు. ఇవాళ (సోమవారం) కుప్పం(Kuppam)లో పర్యటించారు. రెండు రోజుల పాటు సోమ, మంగళ వారాలు చంద్రబాబు కుప్పంలోనే పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన కొత్తపేట(Kothapeta)లోని కన్యకా పరమేశ్వరి ఆలయం(Kanyaka Parameshwari Temple)లో పూజలు చేశారు.
అంతకుముందు అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం మహిళలతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై కీలక ఆరోపణలు చేశారు. ఏపీ మహిళలు ప్రపంచానికే ఆదర్శంగా నిలవాలని కలలుగన్నామన్నారు. ఇప్పుడు చూస్తుంటే డబ్బులకు కక్కుర్తిపడి విదేశాల నుంచి మత్తు పదార్థాలు తీసుకొచ్చి అమ్ముతున్న పరిస్థితిని చూస్తున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.
మహిళలు ఆర్థికంగా పైకి రావాలంటే ఇంటికి 2 ఆవులు ఇవ్వాలనుకున్నామని అన్నారు. అలా అంటే తనను హేళన చేశారని గుర్తుచేశారు. కుప్పంలో వెయ్యి లీటర్లతో మొదలైన పాల సేకరణ ఇప్పుడు 4లక్షల లీటర్లకు చేరిందన్నారు. ఆడబిడ్డల ఆత్మగౌరవం కోసం ఇంటింటికి మరుగుదొడ్లు కట్టించామని టీడీపీ అధినేత చెప్పుకొచ్చారు. అదేవిధంగా మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం ఇవ్వాలని ఆలోచన చేసిందే టీడీపీ అని తెలిపారు.
డ్వాక్రా సంఘాలు పెట్టి మహిళల్లో చైతన్యం తీసుకొచ్చామన్నారు. ఇప్పుడు డ్వాక్రా సంఘాల్లో లక్షల మంది ఉన్నారంటే అది టీడీపీ చొరవేనని తెలిపారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. రాష్ట్రం బాగుండాలంటే కార్యకర్తలు 40రోజులు కష్టపడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా చంద్రబాబు బస చేసేందుకు పార్టీ నేతలు తగు ఏర్పాట్లు చేశారు.
ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత పర్యటనలో భద్రతా వైఫల్యం కొట్టచ్చినట్లు కనిపించింది. కుప్పం టీడీపీ కార్యాలయం వద్ద చంద్రబాబు బస చేసే వాహనాన్ని పార్టీ శ్రేణులు చుట్టుముట్టారు. పరిసరాల్లో అంతగా పోలీసులు కనిపించకపోవడంతో చంద్రబాబు వాహనం నుంచి దిగి మహిళలతో ముఖాముఖి కార్యక్రమం వద్దకు వెళ్లేందుకు ఇబ్బందిపడాల్సి వచ్చింది. కీలక నేతకు అతి సాధారణ భద్రత ఏర్పాటుపై టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేశారు.