– 5 రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా
– తక్షణమే ఎలక్షన్ కోడ్ అమలు
– మొత్తం 679 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు
– తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్
– 4 రాష్ట్రాల్లో ఒకే విడతలో ఎన్నికలు
– ఛత్తీస్ గఢ్ లో మాత్రం రెండు దశల్లో పోలింగ్
– అన్ని రాష్ట్రాలకు డిసెంబర్ 3న కౌంటింగ్
త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం (CEC). తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాలకు ఎన్నికల తేదీలను ఖరారు చేసింది. ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 679 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. మధ్యప్రదేశ్ లో 230 సీట్లు, ఛత్తీస్ గఢ్ లో 90, రాజస్థాన్ లో 200, తెలంగాణలో 119, మిజోరంలో 90 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి.
తెలంగాణ (Telangana) లో నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఒకే విడతలో ఈ పోలింగ్ జరుగుతుంది. రాష్ట్రంలో 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టు ఈసీ ప్రకటించింది. ప్రతి 897 మందికి ఒక పోలింగ్ స్టేషన్ ఉంటుందని తెలిపింది. నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ నవంబర్ 10 కాగా.. నామినేషన్ల స్క్రూటినీ నవంబర్ 13న జరుగుతుంది. అలాగే, నామినేషన్ విత్ డ్రా కు నవంబర్ 15ను చివరి తేదీగా ఖరారు చేశారు.
తెలంగాణలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో 3,17,17,389 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో వందేళ్లు దాటిన వారు 7,689 మంది ఉండగా.. 80 ఏళ్లు పైబడిన ఓటర్లు 4.43 లక్షల మంది.. దివ్యాంగులు 5.06 లక్షలు, తొలిసారి ఓటు హక్కు పొందిన వారు 8.11 లక్షల మంది ఉన్నారు. 5 రాష్ట్రాలలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ప్రకటించింది ఎన్నికల సంఘం.
ఇక రాజస్థాన్ కి నవంబర్ 23న పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడవుతాయి. మధ్యప్రదేశ్ లో నవంబర్ 7న పోలింగ్ ఉంటుంది. మిజోరంలో నవంబర్ 7న ఓటింగ్ నిర్వహించనుండగా.. ఛత్తీస్ గఢ్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశలో నవంబర్ 7న, రెండవ దశలో నవంబర్ 17న జరుగుతాయి. అన్ని రాష్ట్రాలకూ డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడవుతాయని స్పష్టం చేసింది ఎన్నికల సంఘం.