ప్రజా యుద్ధనౌక గద్దర్ కు తుది వీడ్కోలు పలికేందుకు ప్రముఖులు, అభిమానులు ఎల్బీ స్టేడియానికి (LB Stadium) తరలివచ్చారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. గద్దర్(Gaddar) భౌతికకాయాన్ని చూసి పలువురు కన్నీటిపర్యంతమయ్యారు. భారీగా తరలివచ్చిన ప్రజానికంతో ఎల్బీ స్టేడియం కిక్కిరిసిపోయింది.
తెలంగాణ మంత్రులు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి.. గద్దర్ కు నివాళులు అర్పించారు. పూలమాల వేసి అంజలి ఘటించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. అలాగే, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. గద్దర్ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, జానారెడ్డి, రఘునందన్ రావు, కోమటిరెడ్డి, విజయలక్ష్మి సహా పలువురు గద్దర్ కుటుంబ సభ్యులను ఓదార్చారు.
పలువురు సినీ ప్రముఖులు కూడా ఎల్బీ స్టేడియానికి వచ్చారు. నటుడు మోహన్ బాబు గద్దర్ కు శ్రద్ధాంజలి ఘటించారు. జననేన నాయకుడు, నటుడు నాగబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే, కమెడియన్ అలీ, రచయిత పరుచూరి గోపాలకృష్ణ వచ్చారు. వీరితోపాటు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా నివాళులర్పించారు.
ఇటు ప్రముఖులు, అభిమానుల ర్యాలీతో గద్దర్ అంతిమయాత్ర కొనసాగింది. ఎల్బీ స్టేడియం నుంచి గన్ పార్క్, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్తూపం, ట్యాంక్ బండ్ మీదుగా అల్వాల్ లోని ఆయన నివాసం వరకు ఈ యాత్ర జరిగింది. అక్కడి నుంచి బోధి విద్యాలయం వరకు తీసుకెళ్లి అక్కడ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.