మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణ (SC Classification)పై కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా (Rajiv Gauba )నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో కేంద్ర హోం శాఖ, న్యాయశాఖ, గిరిజన, సామాజిక, న్యాయ శాఖల కార్యదర్శులు ఉంటారు.
జనవరి 23వ తేదీన ఈ కమిటీ సమావేశం కానున్నది. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ఎస్పీ వర్గీకరణకు కమిటీ వేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం తాజాగా ఎస్పీ వర్గీకరణపై కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియలో భాగంగా ఓ కమిటీని ఏర్పాటు చేయాలని గతేడాది నవంబర్ 24నే కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబాకు ప్రధాని మోడీ ఆదేశాలు జారీ చేశారు.
తాజాగా ఈ మేరకు కమిటీని ఏర్పాటు చేశారు. గతేడాది నవంబర్ 11న హైదరాబాద్లో మాదిగల విశ్వరూప మహాసభను నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సామాజిక న్యాయానికి తాము కట్టుబడి ఉన్నామని ప్రధాని మోడీ ఆ సభలో వెల్లడించారు. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేయాలన్న సంకల్పంతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు.
ఎస్సీ వర్గీకరణ కోసం మంద కృష్ణ మాదిగ 30 ఏండ్లుగా పోరాటం చేస్తున్నారని వెల్లడించారు. మూడు దశాబ్దాల మాదిగల పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. మాదిగలకు అన్యాయం జరిగిందని తాము భావిస్తున్నామన్నారు. మాదిగల ఉద్యమాన్ని గుర్తించామని, గౌరవిస్తామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ అంశానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.