సీపీఐ(CPI) పార్టీ జాతీయ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి(Chada Venkat Reddy) కాంగ్రెస్(Congress) పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీపీఐ పొత్తుతోనే కాంగ్రెస్ తెలంగాణ(Telangana)లో అధికారంలోకి వచ్చిందని తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సీపీఐ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల హడావిడి మొదలైందని పేర్కొన్నారు.
అయితే, నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని కావాలనే ఉద్దేశ్యంతోనే అడ్డదారులు తొక్కుతున్నారని చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ఇప్పటి వరకు దుర్మార్గమైన పాలన కొనసాగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర వహించి ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలను సమన్వయం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా స్పందించి ఆ దిశగా అడుగులు వేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీలు విజయంవంతం కావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. మరో వైపు ఖజానా దివాళా తీసిందని, కొత్త ప్రభుత్వంపై ప్రజలకు కొండంత ఆశ ఉందని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష పూరితంగా కాకుండా నిర్మాణాత్మకంగా అడుగులు వేస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.
అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం సమయంలోనే ప్రగతి భవనం ఇనుప కంచెలను కూల్చడంపై చాడ వెంకట్ రెడ్డి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఆరోజు తాను సంతోషపడ్డానన్నారు. సింగరేణి ఎన్నికల్లో కార్మికుల పక్షపాత సంఘాన్ని ఎన్నుకోవడం సంతోషకరమని తెలిపారు. రానున్న రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా చాడ వెంకట్‌రెడ్డి అన్నారు.