భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంపై కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి(Mla komatireddy rajagopal reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘అసెంబ్లీ గెలిచినం.. ఇక పార్లమెంట్ ఎన్నికల్లోనూ గెలవబోతున్నాం’ అని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం రాజగోపాల్ రెడ్డి ఎక్స్ (ట్విట్టర్)(X) వేదికగా స్పందించారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran kumar reddy)కి ఒక అన్నగా తోడుగా ఉంటానని ప్రకటించారు. భువనగిరి కోట మీద ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామంటూ ట్వీట్ చేశారు.
ఇదిలాఉండగా, భువనగిరి ఎంపీ టికెట్‌ను కోమటిరెడ్డి సోదరులు తమ కుటుంబం కోసం ఆశించిన విషయం తెలిసిందే. కానీ సీఎం రేవంత్ రెడ్డి తన వర్గీయుడైన చామల కిరణ్ కుమార్ రెడ్డిని భువనగిరి ఎంపీ అభ్యర్థుడిగా ప్రకటించడంతో కోమటిరెడ్డి బ్రదర్స్ ఒకింత షాక్‌కు గురయ్యారు.
అసెంబ్లీ గెలిచినం..
పార్లమెంట్ గెలుస్తున్నం..
ఒక అన్నగా తమ్ముడు చామల కిరణ్ కుమార్ రెడ్డికి తోడుగా ఉంటా..
భువనగిరి కోట మీద కాంగ్రెస్ జెండా ఎగరేస్తా..#TelanganaCongress
— Komatireddy Raj Gopal Reddy (@rajgopalreddy_K) April 15, 2024
అయితే, కిరణ్ కుమార్ రెడ్డికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయంగా పలుకుబడి ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ సహకరిస్తారా? అని మొన్నటివరకు ఒక సందేహం ఉండేది. కానీ తాజాగా రాజగోపాల్ రెడ్డి.. చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పడంతో ఈ సందిగ్దానికి బ్రేక్ పడింది. కాగా, చామల కిరణ్ కుమార్ కొత్త ముఖం ఓటర్లకు పెద్దగా పరిచయం లేదు. బీజేపీ నుంచి బూర నర్సయ్య గౌడ్ వంటి బలమైన బీసీ నేత ఉండటంతో కాంగ్రెస్ గెలుపునకు సవాల్‌గా మారింది.