Chandrayaan-3 : మరి కొన్ని గంటల్లో చంద్రయాన్-3 (Chandrayaan-3) చంద్రుని దక్షిణ ధృవం (South Pole) పై అడుగుపెట్టనుంది.. బ్రిక్స్ సమ్మిట్ కోసం ప్రస్తుతం సౌతాఫ్రికాలో ఉన్న ప్రధాని మోడీ (Modi) ఈ అద్భుత ఘట్టాన్ని అక్కడి నుంచే వర్చ్యువల్ గా చూడనున్నారు. ఈ వ్యోమ నౌక ల్యాండింగ్ ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చూసేందుకు అనువుగా ఆయన ఇస్రో తో కాంటాక్ట్ లోకి వస్తారని అధికార వర్గాలు తెలిపాయి. బుధవారం సాయంత్రం 6 గంటల 4 నిముషాలకు ఈ వ్యోమనౌక చంద్రుని ఉపరితలాన్ని తాకేందుకు అనువుగా ఇస్రో అన్ని ప్రక్రియలను పూర్తి చేసేందుకు సమాయత్తమైంది.
దీన్ని హారిజాంటల్ స్థితి నుంచి నిలువుగా .. వర్టికల్ స్థితిలోకి తేవలసి ఉంటుంది. ఇది కీలక ఘట్టం.. చంద్రయాన్-3
ల్యాండింగ్ ఆపరేషన్స్ ని సాయంత్రం 5 గంటల 20 నిముషాల నుంచి ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది. దేశంలోని విద్యాసంస్థలన్నీ కూడా ఈ ఆపరేషన్స్ ని లైవ్ గా చూపాలని ఇస్రో కోరింది.
అయితే ల్యాండర్ మాడ్యూల్లో అన్ని వ్యవస్థలు సక్రమంగా పని చేస్తున్నాయా.. అలాగే చంద్రునిపై వాతావరణ పరిస్థితులను అనుకూలంగా ఉన్నాయా అన్న విషయాలను నిర్ధారించుకోవలసి ఉంటుందని, ఈ కారణంగా తుది నిర్ణయాన్ని తీసుకోవడం సముచితంగా ఉంటుందని అహ్మదాబాద్ లోని ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ డైరెక్టర్ నీలేష్ ఎం. దేశాయ్ పేర్కొన్నారు. పరిస్థితులు అనుకూలంగా లేని పక్షంలో ల్యాండింగ్ ని ఈ నెల 27 కు వాయిదా వేయవలసి రావచ్చునని ఆయన అన్నారు.
ప్రస్తుతం చంద్రుని చుట్టూ కక్ష్యలో ఉన్న విక్రమ్ ల్యాండర్ నెమ్మదిగా జాబిల్లి ఉపరితలం పై దిగడానికి సిద్ద పడుతోంది. సాయంత్రం సుమారు 5.45 గంటల నుంచి ల్యాండింగ్ సీక్వెన్స్ ప్రారంభమై 6 గంటల 4 నిముషాల వరకు ముగియవలసి ఉందని, ముఖ్యంగా చివరి 15 నిముషాలు అత్యంత ఉత్కంఠ భరితమైనవని ఇస్రో మాజీ చీఫ్ వ్యాఖ్యానించారు. దీన్ని ఆయన ’15 మినిట్స్ ఆఫ్ టెర్రర్’ గా అభివర్ణించారు. అంతా అనుకున్నట్టు జరిగితే చంద్రుని దక్షిణ ధృవానికి సమీపంలో విక్రమ్ ల్యాండ్ అయిన వెంటనే దీని డోర్స్ తెరచుకోనున్నాయి. అందులో నుంచి ఆరు చక్రాలు గల ప్రగ్యాన్ రోవర్ దిగి చంద్రుని ఉపరితలాన్ని తాకనుంది.