సీఎం జగన్ బటన్ నొక్కుడుతో బటన్ నొక్కుడుతో ఒక్కో కుటుంబంపై రూ.8లక్షల భారం పడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఆరోపించారు. అనకాపల్లి జిల్లా, మాడుగులలో సోమవారం ‘రా.. కదలిరా’ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇలాంటి సైకో సీఎంను తన జీవితంలో చూడలేదన్నారు.
జగన్‌ది ఉత్తుత్తి బటన్ నొక్కుడని ప్రజలు గమనించాలన్నారు. జాబ్ క్యాలెండర్, మద్య నిషేదం, సీపీఎస్, డీఎస్సీ, జాబ్ క్యాలెండర్‌కు ఎందుకు బటన్ నొక్కలేదని ప్రశ్నించారు. ‘జాబు రావాలంటే.. బాబు రావాల్సిందే’నని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రేపు ప్రజలంతా ఒకే బటన్ నొక్కుతారని, ప్రజలు నొక్కే బటన్‌తో జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమని అన్నారు. 64 రోజుల్లో టీడీపీ- జనసేన ప్రభుత్వం ఏర్పడబోతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో సైకో పాలన అంతం చేస్తే తప్ప భవిష్యత్ లేదన్నారు చంద్రబాబు. మైనింగ్ బటన్ నొక్కి భూగర్భ సంపద దోచేశారని, ఇసుక బటన్ నొక్కి తాడేపల్లికి సంపద తరలించారని, జగన్ బటన్ డ్రామాలు ప్రజలకు తెలిసిపోయాయని ఆరోపించారు. బటన్ నొక్కుతున్నానని జగన్ గొప్పలు చెబుతున్నారని.. ‘బటన్ నొక్కుడు కాదు.. నీ బొక్కుడు సంగతేంటి’? అని చంద్రబాబు ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీలు పెంచి రూ.64వేల కోట్ల భారం వేసిన గజ దొంగ అంటూ చంద్రబాబు మండిపడ్డారు.
చివరకు చెత్తపై కూడా పన్ను వేశారని, ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం వేశారని దుయ్యబట్టారు. ధనదాహంతో జగన్ ఉత్తరాంధ్రను ఊడ్చేశారని, రుషికొండను జగన్ ఆనకొండలా మింగేశారని దుయ్యబట్టారు. రుషికొండపై రూ.500 కోట్లతో ప్యాలస్ కట్టుకున్నారని, విశాఖలో రూ.40 వేల కోట్లు జగన్ దోచుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ తన సలహాదారులకు రూ.వందల కోట్లు దోచిపెట్టారని, ఒక్క సజ్జల రామకృష్ణా రెడ్డికే సీఎం రూ.150 కోట్లు దోచి పెట్టారని చంద్రబాబు ఆరోపించారు.
లూలూ కంపెనీని తరిమికొట్టి ఆ భూమి మింగేశారన్నారు. విశాఖ ఉక్కుపై ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. దోచుకోవడమే తప్ప.. జగన్‌కు ఉత్తరాంధ్రపై ప్రేమ లేదన్నారు. విశాఖను గంజాయి కేంద్రంగా క్రైమ్ సిటీగా మార్చారని, గంజాయి అమ్ముతూ ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో దొరికిపోయారన్నారు. జగన్‌రెడ్డి లాంటి సీఎం మనకు అవసరమా? అని చంద్రబాబు ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు.