కీలక పదవుల్లో ఉన్న నేతలు పొరపాటున ఏం మాట్లాడినా సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తుంటారు. అయితే ఏపీ సీఎం జగన్‌కూ అలాంటి పరిస్థితి ఎదురైంది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి(CM Jagan)కి ఉల్లిపాయకి, బంగాళ దుంపకి తేడా తెలీదని టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu nayudu) విమర్శించారు. ఇవాళ(శనివారం) ఆయన బాపట్లలో మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్‌పై సెటైర్లు విసిరారు.
చంద్రబాబు అలా ఎందుకన్నారంటే.. మిచాంగ్ తుపాను బాధితులను ఆదుకునేందుకు జగన్ ప్రభుత్వం ముందుకొచ్చి పేదలకు నిత్యావసరాలు అందజేసే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగానే ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం తిరుపతి జిల్లా బాలిరెడ్డిపల్లెలో వరద బాధితులతో మాట్లాడారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఇచ్చే నిత్యావసరాల పేర్లు చెబుతూ సీఎం జగన్ తప్పులో కాలేశారు.
కిలో పొటాటో ఇస్తామని చెప్పిన సీఎం పొటాటో అంటే ఉల్లిగడ్డే కదా? అని సందేహ పడ్డారు. ఇంతలో పక్కనే ఉన్న అదికారి పొటాటో అంటే ఆలుగడ్డ(బంగాళదుంప) అని చెప్పడంతో సీఎం జగన్ బంగాళదుంప ఇస్తున్నామని చెప్పారు. దీంతో ఆయన మాటలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ మేరకు ప్రతిపక్ష నేత చంద్రబాబు జగన్‌పై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రికి ఉల్లిపాయకి, బంగాళదుంపకి తేడా తెలియదంటూ ఎద్దేవా చేశారు.
ఐదేళ్ల క్రితం హుద్ హుద్ తుపాను సమయంలో 25 కేజీలు బియ్యం, ఐదు వేలు నగదు ఇచ్చామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఈ ప్రభుత్వం మాటలు చెప్తుంది తప్ప పేదలని ఆదుకునే పరిస్థితి లేదన్నారు. యానాదులందరినీ ఆదుకుంటామన్నారు. యానాదుల్లో సైతం రాజకీయ చైతన్యం వచ్చి నాయకులుగా ఎదగాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
మిచౌంగ్ తుపాను భయంకరంగా వచ్చిందని లోతట్టు కాలనీలోని రెండు మూడు రోజులు నీళ్లలోనే ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. నేడు బాపట్ల ఒక జిల్లా హెడ్ క్వార్టర్ అని.. అలాంటి జిల్లా కేంద్రంలో కాలనీలు నీటమునగటం దారుణమన్నారు. టీడీపీకి ఓటు వేశారని ఎస్టీ కాలనీ వాసులను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. యానాదులు ఎప్పుడూ టీడీపీకి అండగా ఉన్నారని చంద్రబాబు తెలిపారు.