ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసు(Skil Scam)లో అరెస్ట్ అయిన చంద్రబాబు(Chandra babu) మధ్యంతర బెయిల్పై విడుదలైన తర్వాత ఆసుపత్రిలో పలు చికిత్సలు చేయించుకున్నారు. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కూడా వచ్చింది. ఈ మధ్య పుణ్యక్షేత్రాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. శనివారం విజయవాడలో ఇంద్రకీలాద్రి(Indra Keeladri)పై కొలువుదీరిన కనకదుర్గమ్మను ఆయన తన సతీమణితో కలిసి దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నా శేష జీవితం ఇక ప్రజలకు అంకితం.. ఈ నాలుగు రోజులు రాజకీయాలు మాట్లాడబోను’ అని వెల్లడించారు. ధర్మాన్ని కాపాడటానికి శుక్రవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నట్లు తెలిపారు. ఇవాళ శక్తి స్వరూపిణి దుర్గమ్మ దర్శనం చేసుకుని దుష్టుల్ని శిక్షించమని కోరానని చెప్పారు. అదేవిధంగా 5వ తేదీన శ్రీశైల దర్శనం, అనంతరం దర్గాకు కూడా వెళ్తానన్నారు. ఆయా ఆలయాల సందర్శనం తర్వాతే తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని చంద్రబాబు వెల్లడించారు.
ఈ కలియుగంలో ప్రతీదీ త్వరగా మర్చిపోతామని అయితే, ఇబ్బంది పడితే మాత్రం మర్చిపోమని చంద్రబాబు అన్నారు. తాను జైలులో ఉన్నప్పుడు గచ్చిబౌలిలో ఐటీ ఉద్యోగుల స్వచ్ఛందంగా మద్దతివ్వడం సంతోషానిచ్చిందని తెలిపారు. తన బాగుకోరి అందరూ అనునిత్యం ప్రార్థించారని, కొంత మంది ప్రాణ త్యాగాలు చేశారని గుర్తుచేశారు. తన కష్టంలో భారతీయులంతా స్పందించారని వారందరికీ తన కృతజ్ఞతలను తెలిపారు.
ఇక, ఈ నెల 10వ తేదీ నుంచి జిల్లాల పర్యటనలకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈలోపు ఓట్ల అక్రమాలపై ఢిల్లీ వెళ్లి సీఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలోనే ఢిల్లీ వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 6వ తేదీ నుంచి 8వ తేదీ లోపు తనకు సమయం కేటాయించాలంటూ చంద్రబాబు సీఈసీకి లేఖ రాయనున్నారు. అదేవిధంగా 10వ తేదీన శ్రీకాకుళం, 11న కాకినాడ, 14న నరసరావుపేట, 15వ తేదీన కడపల్లో నిర్వహించే సభల్లో బాబు పాల్గొంటారు. మరోవైపు.. ఈ నెలలోనే చంద్రబాబు- జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిసి ఓ బహిరంగ సభ నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.